న్యూఢిల్లీ, నవంబర్ 2 (తెలుగు ప్రభ): దేశంలోని ఏడు రాష్ట్రాల్లో వరి పంట అవశేషాలను కాల్చివేసే ఘటనలు ఈ ఏడాది గణనీయంగా తగ్గాయి. సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 1 మధ్య ఈ ఘటనలు గత ఏడాదితో పోలిస్తే 26.63 శాతం తగ్గి 3,316కు చేరినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) వెల్లడించింది. అయితే నమోదైన మొత్తం ఘటనల్లో దాదాపు సగం ఒక్క పంజాబ్‌లోనే చోటుచేసుకోవడం గమనార్హం.
ఐసీఏఆర్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. పంజాబ్‌లో అత్యధికంగా 1,514 ఘటనలు నమోదయ్యాయి. ఆ తర్వాత రాజస్థాన్‌లో 671, మధ్యప్రదేశ్‌లో 566, ఉత్తరప్రదేశ్‌లో 345, ఉత్తరాఖండ్‌లో 176, హరియాణాలో 42, ఢిల్లీలో రెండు ఘటనలు వెలుగుచూశాయి. పంజాబ్‌లోని అమృత్‌సర్, ఫిరోజ్‌పూర్, కపుర్తల, సంగ్రూర్, బటిండా తదితర జిల్లాల్లో అత్యధికంగా ఈ ఘటనలు నమోదయ్యాయి. ఐసీఏఆర్‌లోని క్రీమ్స్ ల్యాబ్ ఆధ్వర్యంలో శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ ద్వారా ఈ వివరాలను సేకరించారు.
రైతులు గడ్డి ఎందుకు కాల్చుతున్నారు?
వరి కోతకు, గోధుమల విత్తనాలు వేయడానికి మధ్య కేవలం 10 నుంచి 25 రోజుల సమయం మాత్రమే ఉండటంతో రైతులు పంట అవశేషాలను కాల్చే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మల్చింగ్, బేలింగ్ యంత్రాలు అందుబాటులో లేకపోవడం, వాటి అద్దె భారం, తక్కువ సమయంలో పొలాన్ని సిద్ధం చేయాల్సిన అవసరం ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. సకాలంలో గోధుమ విత్తనాలు వేయకపోతే దిగుబడి తగ్గుతుందనే ఆందోళన కూడా రైతుల్లో ఉంది.
సబ్సిడీలు.. సత్ఫలితాలు
పంట అవశేషాల నిర్వహణ (సీఆర్‌ఎం) పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీలు అందిస్తోంది. వ్యక్తిగత రైతులకు 50 శాతం, సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు (ఎఫ్‌పీవో) 80 శాతం ఆర్థిక సాయం కల్పిస్తోంది. హ్యాపీ సీడర్, సూపర్ సీడర్, బేలర్లు, మల్చర్లు కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తోంది. చిన్న రైతుల కోసం కస్టమ్ హైరింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పంట అవశేషాలను పొలంలోనే కలిపేయడం లేదా బయోమాస్ పెల్లెట్లు, థర్మల్ పవర్ ప్లాంట్లకు తరలించడం వంటి ప్రత్యామ్నాయాలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది.

