Thursday, March 12, 2026
Homeనేషనల్Citizenship : బ్రిటీష్ వనిత.. 80 ఏళ్ల వయసులో పౌరసత్వ 'పద్మం'.. పెపితా సేథ్...

Citizenship : బ్రిటీష్ వనిత.. 80 ఏళ్ల వయసులో పౌరసత్వ ‘పద్మం’.. పెపితా సేథ్ సేవా యజ్ఞం!

Padma Shri Pepita Seth Indian Citizenship : పుట్టింది లండన్ నగరంలోని సఫోల్క్ వీధుల్లో.. పెరిగింది పాశ్చాత్య సంస్కృతిలో.. కానీ ఆమె మనసు మాత్రం ఎప్పుడూ భారతీయత కోసమే పరితపించేది. 150 ఏళ్ల క్రితం నాటి తన తాతగారి డైరీలో చదివిన అక్షరాలు ఆమెలో భారతదేశం పట్ల ఆసక్తిని రేకెత్తించాయి. ఫలితంగా, 27 ఏళ్ల ప్రాయంలో పర్యాటకురాలిగా అడుగుపెట్టిన ఆ బ్రిటీష్ మహిళ, నేడు 80 ఏళ్ల వయసులో “భారతీయ పౌరురాలిగా” అధికారిక ముద్ర వేయించుకున్నారు. ఆమె మరెవరో కాదు, కేరళ కళా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన పద్మశ్రీ గ్రహీత పెపితా సేథ్.

- Advertisement -

డైరీలో మెరిసిన భారతం.. జీవితాన్ని మార్చిన ప్రయాణం : పెపితా సేథ్ తాతగారు బ్రిటీష్ సైన్యంలో పనిచేసేవారు. 1857 నాటి భారత దేశ పరిస్థితులపై ఆయన రాసుకున్న డైరీని చదివిన పెపితా, ఎలాగైనా ఆ గడ్డను చూడాలని నిశ్చయించుకున్నారు. తన 27వ ఏట కేరళలోని త్రిస్సూర్‌లో అడుగుపెట్టిన ఆమె, అక్కడి సంస్కృతికి ఫిదా అయిపోయారు. కేవలం పర్యటనతో సరిపెట్టుకోకుండా, అక్కడే ఉండిపోయి నాలుగు దశాబ్దాలుగా కేరళ ఆచారాలపై లోతైన పరిశోధన చేశారు. ముఖ్యంగా ‘మలబార్ తెయ్యమ్’ కళలపై ఆమె చేసిన కృషి అనన్యం.

గురువాయూర్ ఆలయంలో అరుదైన ప్రవేశం : సాధారణంగా విదేశీయులకు ప్రవేశం కష్టతరమైన గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించే అనుమతి పొందిన అతి కొద్దిమంది విదేశీయులలో పెపితా ఒకరు. 1981 నుంచి ఆమె హిందూ ఆచారాలను పాటిస్తూ, ఆలయ సంప్రదాయాలను అధ్యయనం చేశారు. ఈ క్రమంలోనే ఆమె రాసిన ‘హెవెన్ ఆఫ్ ఎర్త్: ది యూనివర్స్ ఆఫ్ కేరళాస్ గురువాయూర్ టెంపుల్’ అనే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. గురువాయూర్ ఏనుగుల పట్ల ఆమెకు ఉన్న ప్రేమ వెలకట్టలేనిది. మదపు ఏనుగును అదుపు చేసే క్రమంలో ఆమె తీసిన ఫోటోలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.

పద్మశ్రీ నుంచి పౌరసత్వం వరకు : కేరళ కళా సంపదకు పెపితా చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2012లో ఆమెను ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది. త్రిస్సూర్ కలెక్టరేట్‌లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అర్జున్ పాండ్యన్ చేతుల మీదుగా ఆమె తన పౌరసత్వ పత్రాలను అందుకున్నారు. “నన్ను కూతురిగా స్వీకరించిన ఈ దేశానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇప్పుడు నేను గర్వంగా భారతీయ పౌరురాలిని అని చెప్పుకోగలను” అని ఆమె ఉద్వేగానికి లోనయ్యారు.

వ్యక్తిగత జీవితం – సినీ నేపథ్యం : పెపితా సేథ్ ప్రముఖ నటుడు రోషన్ సేథ్‌ను వివాహం చేసుకున్నారు. రిచర్డ్ అటెన్ బరో నిర్మించిన ‘గాంధీ’ చిత్రంలో జవహర్ లాల్ నెహ్రూ పాత్రను పోషించి రోషన్ సేథ్ అంతర్జాతీయ గుర్తింపు పొందారు. కేరళలోని మాతృస్వామ్య వ్యవస్థ (మరుమక్కథయ్యం)పై కూడా పెపితా విశేష పరిశోధనలు చేసి, ఆ వ్యవస్థలోని లోతుపాతులను తన రచనల ద్వారా ప్రపంచానికి వివరించారు.

ఇటీవలే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన కెనడా పౌరసత్వాన్ని వదులుకుని భారత పౌరసత్వం పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు పెపితా సేథ్ కూడా అదే బాటలో పయనించి, తన శేష జీవితాన్ని తను ప్రేమించిన భారత్ గడ్డపైనే గడపాలని నిర్ణయించుకోవడం విశేషం.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News