Saturday, November 15, 2025
Homeనేషనల్PahalgamAttack : చాక్లెట్ కవర్లతో... బట్టబయలైన పహల్గాం ఉగ్రకుట్ర!

PahalgamAttack : చాక్లెట్ కవర్లతో… బట్టబయలైన పహల్గాం ఉగ్రకుట్ర!

Pahalgam terror attack investigation : పవిత్ర అమర్‌నాథ్ యాత్రా మార్గంలోని పహల్గాంపై ఉగ్రదాడి చేసి, అమాయక పర్యాటకులను పొట్టనపెట్టుకున్న పాశవిక కుట్ర గుట్టురట్టయింది. ‘ఆపరేషన్ మహాదేవ్’ పేరుతో భారత భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో హతమైన ఉగ్రవాదుల అసలు రంగు బయటపడింది. ఆధారాలుగా నిలిచింది కేవలం ఆయుధాలు కాదు.. వారి జేబుల్లోని చాక్లెట్ కవర్లు, ఓటరు కార్డులు..! అసలు ఈ కుట్ర మూలాలు ఎక్కడివి..? దాయాది దేశం పాత్రను మన సైన్యం ఎలా బయటపెట్టింది…? ‘ఆపరేషన్ మహాదేవ్’లో వెలుగుచూసిన సంచలన నిజాలేంటి..? 

‘ఆపరేషన్ మహాదేవ్’లో పాక్ ముద్ర స్పష్టం : ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ‘ఆపరేషన్ మహాదేవ్‌’లో హతమైన ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్థానీ జాతీయులేనని, వారికి లష్కరే తొయిబా (LeT) సంస్థతో సంబంధాలున్నాయని భారత ప్రభుత్వం ఆధారాలతో సహా ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభ వేదికగా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు వారి పాకిస్థానీ మూలాలను స్పష్టంగా రుజువు చేస్తున్నాయి.

- Advertisement -

చిరునామా చెప్పిన చాక్లెట్లు.. ఓట్లు : ఎన్‌కౌంటర్ స్థలంలో భద్రతా దళాలు జరిపిన తనిఖీల్లో పక్కా ఆధారాలు లభ్యమయ్యాయి.

ఉగ్రవాదుల గుర్తింపు: హతమైన వారిని సులేమాన్ షా (మాస్టర్‌మైండ్, LeT ఏ++ కమాండర్), అబూ హంజా (ఏ గ్రేడ్ కమాండర్), యాసీ (ఏ గ్రేడ్ కమాండర్)గా గుర్తించారు. వీరంతా పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని రావల్‌కోట్‌కు సమీప గ్రామస్థులు.

కరాచీ చాక్లెట్లు: ఉగ్రవాదుల వద్ద లభించిన చాక్లెట్ కవర్లపై “కరాచీలో తయారీ” అని స్పష్టంగా ఉంది. వాటి లాట్ నంబర్లను బట్టి, అవి 2024 మే నెలలో కరాచీ నుంచి ముజఫరాబాద్‌కు చేరినట్లు తేలింది.

పాకిస్థాన్ ఓటరు స్లిప్‌లు: సులేమాన్ షా, అబూ హంజాల పర్సుల్లో పాకిస్థాన్ ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు స్లిప్‌లు దొరికాయి. వారికి లాహోర్ (NA-125), గుజ్రాన్‌వాలా (NA-79) నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నట్లు తేలింది.

స్మార్ట్ ఐడీ కార్డులు: పాకిస్థాన్ ప్రభుత్వ సంస్థ ‘నాడ్రా’ (NADRA) జారీ చేసిన స్మార్ట్ ఐడీ చిప్‌లు కూడా వీరి వద్ద లభించాయి. వీటిలో వారి వేలిముద్రలు, ఫోటోలు, కుటుంబ వివరాలు నిక్షిప్తమై ఉన్నాయి.

శాటిలైట్ ఫోన్ కాల్స్.. చొరబాటు మార్గం :కేవలం వస్తువులే కాదు, సాంకేతిక ఆధారాలు కూడా పాకిస్థాన్ కుట్రను బట్టబయలు చేశాయి.

చొరబాటు: ఈ ఉగ్రవాద త్రయం జమ్మూకశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్ వద్ద నియంత్రణ రేఖ (LoC) దాటి భారత్‌లోకి చొరబడినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

జీపీఎస్ : సులేమాన్ షా వద్ద దొరికిన గార్మిన్ జీపీఎస్ పరికరం వారి కదలికల పూర్తి సమాచారాన్ని అందించింది. ఏప్రిల్ 22న పహల్గాంలో దాడి చేశాక, వారు దచిగాం అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్లు ఇది స్పష్టం చేసింది.

డీఎన్ఏ సరిపోలిక: దాడి జరిగిన ప్రాంతంలో దొరికిన చిరిగిన చొక్కా నుంచి సేకరించిన డీఎన్ఏ నమూనాలు, హతమైన ముగ్గురు ఉగ్రవాదుల డీఎన్ఏతో సరిపోలాయి.

శాటిలైట్ ఫోన్ కాల్స్: ఏప్రిల్ 22 నుంచి జూలై 25 వరకు, ఉగ్రవాదులు ప్రతిరోజూ రాత్రి శాటిలైట్ ఫోన్ ద్వారా పాకిస్థాన్‌లోని తమ హ్యాండ్లర్‌ సాజిద్ సైఫుల్లా జట్‌తో మాట్లాడినట్లు కాల్ డేటా రికార్డులు వెల్లడించాయి.

సరిహద్దు ఆవల సాక్ష్యం.. అంతిమయాత్ర వీడియోలు : భారత వాదనకు బలం చేకూరుస్తూ, సరిహద్దు ఆవలి నుంచి కూడా తిరుగులేని సాక్ష్యాలు లభించాయి. హతమైన ఉగ్రవాదుల కుటుంబాలు పాకిస్థాన్‌లోనే ఉన్నాయి. జూలై 29న, లష్కరే తొయిబా రావల్‌కోట్ చీఫ్ రిజ్వాన్ అనీస్, ఆ ఉగ్రవాదుల కుటుంబాలను పరామర్శించి, వారి కోసం ప్రార్థనలు జరిపించాడు. స్థానికులు ఈ ఘటనను వీడియో తీయడం, అది బయటకు రావడంతో పాకిస్థాన్ పాత్రపై ఎలాంటి సందేహాలకు తావులేకుండా పోయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad