Pakistan’s role in Pahalgam terror attack : పహల్గాం పర్యాటకులపై నెత్తుటి మరకలు అంటించిన ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ పక్కా ప్రమేయం మరోసారి ప్రపంచం ముందు నిస్సిగ్గుగా నిలబడింది. భారత భద్రతా దళాలు చేపట్టిన “ఆపరేషన్ మహాదేవ్”లో హతమైన లష్కరే తోయిబా ఉగ్రవాదికి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో (PoK) అంత్యక్రియలు నిర్వహించడమే ఇందుకు తిరుగులేని సాక్ష్యంగా నిలిచింది.ఈ పరిణామం, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ద్వంద్వ వైఖరిని మరోసారి బహిర్గతం చేసింది. అసలు, భద్రతా బలగాలు ఈ కిరాతకులను ఎలా గుర్తించాయి..? ఈ ఆపరేషన్ వెనుక ఉన్న కీలక ఆధారాలు ఏమిటి..?
ఉగ్రవాదులను పట్టించిన ఫోన్: గతేడాది దక్షిణ కశ్మీర్‌లో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న ఒక మొబైల్ ఫోన్, పహల్గాం దాడి కేసులో అత్యంత కీలకమైన ఆధారం అయింది. ఆ ఫోన్‌లో లష్కరే తోయిబాకు చెందిన పలువురు ఉగ్రవాదుల ఫోటోలు లభించాయి. అందులోనే పహల్గాం దాడికి పాల్పడిన సులేమాన్ అలియాస్ ఫైజల్ జట్, హమ్జా అఫ్గానీ, జిబ్రాన్‌లు ఆయుధాలతో ఉన్న ఫోటోలను అధికారులు గుర్తించారు. దాడి జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో ఈ ఫోటోలను పోల్చి చూసి, ముష్కరులు వీరేనని నిర్ధారించుకున్నారు.
దాచిగామ్ అడవుల్లో వేట: ఉగ్రవాదులను గుర్తించిన వెంటనే, వారిని మట్టుబెట్టేందుకు భద్రతా దళాలు “ఆపరేషన్ మహాదేవ్” పేరుతో భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ముష్కరులు శ్రీనగర్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని దాచిగామ్ అటవీ ప్రాంతంలో నక్కినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఉగ్రవాదులు అత్యాధునిక లాంగ్-రేంజ్ వైర్‌లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్‌ను వాడుతున్నారని తెలుసుకున్న అధికారులు, ఆ సిగ్నల్స్‌ను ట్రేస్ చేసి వారి కదలికలను గమనించారు. ఇంటిలిజెన్స్ బ్యూరో నిరంతర శ్రమతో, ఉగ్రవాదులు ఉన్న కచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించారు. అనేకసార్లు భద్రతా దళాల కళ్లుగప్పి తప్పించుకున్నప్పటికీ, జులై 28న పక్కా ప్రణాళికతో వారిని చుట్టుముట్టి మట్టుబెట్టాయి.
పీవోకేలో అంత్యక్రియలు – బయటపడ్డ నగ్నసత్యం : ఆపరేషన్ మహాదేవ్‌లో హతమైన ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు చెందినవారే అనడానికి తిరుగులేని ఆధారం లభించింది. వారిలో ఒకడైన తాహిర్ హబీబ్ అలియాస్ అఫ్గానీకి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని రావల్‌కోట్ ఖైగలా గ్రామంలో “జనాజా ఏ గైబ్” (మృతదేహం అందుబాటులో లేనప్పుడు చేసే ప్రార్థనలు) విధానంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు టెలిగ్రామ్ ఛానళ్లలో వ్యాపించాయి.
ఈ అంత్యక్రియల సమయంలో ఆసక్తికరమైన ఘర్షణ చోటుచేసుకుంది. స్థానిక లష్కరే కమాండర్ రిజ్వాన్ హనీఫ్, తన అనుచరులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నించగా, తాహిర్ కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి, ఉగ్రవాదులు తమ ఆయుధాలతో స్థానికులను బెదిరించడంతో వారు ఆందోళనకు దిగారు. ఈ ఘటన, ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా పీవోకేలో పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను సూచిస్తోంది.
మూడేళ్ల క్రితమే చొరబాటు: దాదాపు మూడేళ్ల క్రితం 20 నుంచి 25 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. వీరు 2024లో రెండు గ్రూపులుగా విడిపోయారని, ఒక గ్రూపునకు పహల్గాం దాడిలో హతమైన సులేమాన్ నాయకత్వం వహించాడని, మరో గ్రూపునకు ముసా అనే ఉగ్రవాది నేతృత్వం వహిస్తున్నాడని తేలింది. ఈ బృందాలు గతంలో అనేకసార్లు భద్రతా దళాలపై దాడులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.


