Parag chief Appointed new Raw chief: దేశ భద్రతకు కంటికి రెప్పలా కాపలా కాసే అత్యంత కీలకమైన గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) కు నూతన సారథిగా పరాగ్ జైన్ నియమితులయ్యారు. వ్యూహాత్మక దక్షత, నిఘా పరిజ్ఞానంలో నిరుపమాన అనుభవం కలిగిన 1989 బ్యాచ్ పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన జైన్, ‘RAW ‘ చీఫ్‌గా నియమితులై దేశానికి మరింత శక్తిని సమకూర్చనున్నారు.
2025 జూన్ 28న, కేంద్ర ప్రభుత్వం అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ (ACC) పరాగ్ జైన్‌ను ‘రా’ చీఫ్‌గా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి రెండేళ్ల పాటు ఆయన ఈ అత్యంత కీలక బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ప్రస్తుత చీఫ్ రవి సిన్హా పదవీకాలం జూన్ 30న ముగియనుండగా, జైన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.’రా’లో రెండో అత్యంత సీనియర్ అధికారిగా, ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ (ARC) అధిపతిగా పరాగ్ జైన్ అపారమైన అనుభవం ఆయనను ఈ కీలక పదవికి ఎంపిక చేయడానికి దోహదపడింది. గూఢచార వర్గాల్లో “సూపర్ స్లూత్” గా పేరుగాంచిన జైన్, మానవ ఇంటెలిజెన్స్ (HUMINT) తో పాటు సాంకేతిక ఇంటెలిజెన్స్ (TECHINT) ను సమర్థవంతంగా మిళితం చేయడంలో నిష్ణాతుడుగా పేరొందాడు.
కెరీర్ మైలురాళ్లు – అపార అనుభవం:
1989 బ్యాచ్ పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్, దేశ భద్రతకు దశాబ్దాల పాటు నిస్వార్థ సేవ అందించారు. ఆయన కెరీర్ ప్రస్థానం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ విస్తరించింది, అనేక కీలక సమయాల్లో ఆయన వ్యూహాత్మక నిర్ణయాలు, కార్యాచరణ నైపుణ్యం దేశానికి ఎంతో ఉపకరించాయి.
ఉగ్రవాద నిర్మూలనలో కీలక పాత్ర:
1990లలో పంజాబ్‌లో ఉగ్రవాదం తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో, జైన్ చండీగఢ్‌లో ఎస్ఎస్‌పీగా, లూధియానాలో డీఐజీగా, భటిండా, మన్సా, హోషియార్‌పూర్‌లలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ కీలక సమయాల్లో ఆయన సమర్థవంతమైన నాయకత్వం, వ్యూహాత్మక నిర్ణయాలు ఉగ్రవాదాన్ని కట్టడి చేయడంలో గణనీయమైన పాత్ర పోషించాయి. 2021లో పంజాబ్ డీజీపీగా పదోన్నతి పొందినప్పటికీ, ఆయన కేంద్ర డిప్యూటేషన్‌పై కొనసాగారు.
జాతీయ భద్రతకు అంకితభావం:
జైన్ అనుభవం కేవలం దేశీయ పరిధికి మాత్రమే పరిమితం కాలేదు. ఆర్టికల్ 370 రద్దు, ఆపరేషన్ బాలాకోట్ వంటి కీలక సమయాల్లో జమ్మూకశ్మీర్‌లో ‘రా’ మిషన్లను సమర్థవంతంగా నిర్వహించి, దేశ అంతర్గత భద్రతకు కొత్త ఊపిరి పోశారు. అంతర్జాతీయ స్థాయిలో కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాద నెట్‌వర్క్‌లను పసిగట్టడంలో, శ్రీలంకలో పలు కీలక మిషన్లలో ఆయన పాత్ర పోసించారు. ఈ మిషన్ల వివరాలు ధృవీకరించబడనప్పటికీ, ఆయన విస్తృత అంతర్జాతీయ నెట్‌వర్క్ కార్యాచరణ నైపుణ్యంపై ఇది స్పష్టమైన సంకేతంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఆపరేషన్ సిందూర్ పోరాటంలో జైన్ పాత్ర:
ఇటీవల భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’లో పరాగ్ జైన్ అందించిన ఇంటెలిజెన్స్ అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్ర స్థావరాలు, సైనిక సౌకర్యాలపై ఖచ్చితమైన దాడులకు ‘ఆపరేషన్ సిందూర్’ను విజయవంతం చేయడంలో ARC అధిపతిగా జైన్ కీలక భూమిక పోషించారు. గగనతల నిఘా ద్వారా అత్యంత సున్నితమైన సమాచారాన్ని సేకరించి భారత సైన్యానికి సహకరించారు. ఈ ఆపరేషన్ భారత గూఢచార, సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. పరాగ్ జైన్ ‘రా’ చీఫ్‌గా నియామకం దేశ భద్రతా వ్యవస్థకు ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. ఆయన అపార అనుభవంతో ‘రా’ మరింత పటిష్టంగా మారి, దేశ భద్రతను పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.