Indian Parliament slogan controversy : ఏ నినాదాలైతే స్వాతంత్ర్య సంగ్రామానికి ఊపిరిలూదాయో, ఏ నినాదాలైతే కోట్ల మంది భారతీయుల నరనరాల్లో దేశభక్తిని ప్రవహింపజేశాయో, ఇప్పుడు అవే నినాదాలు ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటులో వాడరాదన్న నిబంధన తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. సభా గౌరవం పేరిట రాజ్యసభ సెక్రటేరియట్ జారీ చేసిన ఆదేశాలు, అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలకు ఆజ్యం పోశాయి.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు, సభా కార్యకలాపాలు సజావుగా, గౌరవప్రదంగా సాగేందుకు రాజ్యసభ సెక్రటేరియట్ సభ్యుల కోసం విడుదల చేసిన హ్యాండ్‌బుక్‌లోని ఓ సూచన పెను వివాదానికి కేంద్ర బిందువైంది. సభలో కానీ, వెలుపల కానీ ‘వందేమాతరం’, ‘జై హింద్’ వంటి నినాదాలు చేయవద్దని, అలా చేయడం సభా గౌరవాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఆ నోటిఫికేషన్ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ, అధికార బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.
బ్రిటిష్ వారికి, బీజేపీకి తేడా ఏంటి?: కాంగ్రెస్ ఫైర్
ఈ ఆదేశాలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే తీవ్రంగా స్పందించారు. స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని రగిలించిన నినాదాలను అడ్డుకోవాలని చూడటం దిగ్భ్రాంతికరమని వ్యాఖ్యానించారు.
“నాకు ఆశ్చర్యంగా ఉంది. భారత గడ్డపై ‘వందేమాతరం’, ‘జై హింద్’ నినాదాలతో సమస్య ఎవరికి ఉంటుంది? ఒకప్పుడు బ్రిటిష్ పాలకులకు ఈ నినాదాలు వింటే వణుకు పుట్టేది. ఇప్పుడు బీజేపీకి కూడా అవే సమస్యగా మారాయా?” అని సుప్రియా శ్రీనాతే సూటిగా ప్రశ్నించారు. ‘జై హింద్’ అంటే హిందూస్థాన్ వర్ధిల్లాలి అని అర్థమని, ఇది ప్రతి భారతీయుడి గుండెలోతుల్లోంచి వచ్చిన శక్తిమంతమైన నినాదమని ఆమె గుర్తుచేశారు.
నినాదాల వెనుక వీర చరిత్ర ఈ సందర్భంగా సుప్రియా శ్రీనాతే ఆ నినాదాల చారిత్రక ప్రాధాన్యతను వివరించారు. జై హింద్ ఈ నినాదాన్ని తొలిసారిగా 1907లో కేరళకు చెందిన విప్లవకారుడు చెంపకరామన్ పిళ్లై పలికారు. ఆ తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆయన స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ దీనిని తమ అధికారిక నినాదంగా స్వీకరించడంతో దేశవ్యాప్తంగా మార్మోగింది. స్వాతంత్ర్యం అనంతరం భారత సాయుధ దళాలు దీనిని అధికారిక వందనంగా స్వీకరించాయి. ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కూడా తన ప్రసంగాలను ‘జై హింద్’తో ముగించేవారని ఆమె తెలిపారు.
వందేమాతరం: 1870లో బంకించంద్ర ఛటర్జీ రాసిన ఈ గేయాన్ని, 1896లో కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు. 1905 స్వదేశీ ఉద్యమ సమయంలో ఇది జాతీయవాదానికి ప్రతీకగా మారింది. బ్రిటిష్ పాలకులు ఈ నినాదాన్ని నిషేధించి, పలికిన వారిని జైల్లో పెట్టారు. భగత్ సింగ్, ఖుదీరామ్ బోస్ వంటి వీరులు ఉరికంబం ఎక్కే ముందు కూడా ‘వందేమాతరం’ అనే నినదించారు. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ దీనిని మన జాతీయ గేయంగా గుర్తించింది.
“ఇంతటి వీర చరిత్ర కలిగిన ఈ నినాదాలతో ఎవరికి సమస్య ఉంటుంది? దేశభక్తి అంటేనే భయపడేవారికే వీటితో సమస్య” అని శ్రీనాతే పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
అది కొత్తేమీ కాదు: అధికారుల వివరణ
ఈ వివాదంపై రాజ్యసభ సెక్రటేరియట్ వర్గాలు స్పందించాయి. ఇలాంటి సూచనలు జారీ చేయడం ఇదే మొదటిసారి కాదని స్పష్టం చేశాయి. సభా కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా, సభ్యులు పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించాలనే ఉద్దేశంతోనే ఈ సూచనలు ఇస్తామని తెలిపాయి. గతంలో 2005 నవంబరులో, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి సర్క్యులర్ ఒకటి జారీ చేసిందని అధికారులు గుర్తు చేశారు.
ఏది ఏమైనప్పటికీ, దేశభక్తికి ప్రతీకలుగా నిలిచిన నినాదాలపై ఆంక్షలు విధించడం సరైనదేనా అనే చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది.

