Monday, March 31, 2025
Homeనేషనల్Solar Eclipse: నేడు సూర్యగ్రహణం.. భారత్ లో ఎక్కడ కనిపిస్తుంది.. పూర్తి వివరాలు ఇవే..!

Solar Eclipse: నేడు సూర్యగ్రహణం.. భారత్ లో ఎక్కడ కనిపిస్తుంది.. పూర్తి వివరాలు ఇవే..!

సూర్యగ్రహణం అనేది విశ్వంలో జరిగే ఒక అద్భుత ఖగోళ సంఘటన. ఈ అరుదైన దృశ్యం ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. అలాంటి ఘట్టమే నేడు (మార్చి 29, 2025) న జరగనుంది. ఈసారి పాక్షిక సూర్యగ్రహణం కొన్ని ప్రాంతాల్లో కనిపించనుంది. అయితే ఈ గ్రహణ ప్రభావం భారత్ పై ఉంటుందా. నిపుణులు ఏమంటున్నారు. ఎప్పుడు గ్రహణం ఏర్పడుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం.

- Advertisement -

ఎక్కడ కనిపిస్తుంది: నాసా నివేదికల ప్రకారం, ఈ సూర్యగ్రహణం యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా, ఆఫ్రికా, అట్లాంటిక్ మరియు ఆర్కిటిక్ మహాసముద్ర ప్రాంతాల్లో కనిపిస్తుంది. భారతదేశం మాత్రం ఈ గ్రహణ ప్రభావం ఉండదని.. ఎక్కడా కనిపించదని చెబుతున్నారు.

ఈ పాక్షిక సూర్యగ్రహణం ఉత్తర అమెరికాలో సూర్యోదయం సమయంలో స్పష్టంగా ఉంటుంది. న్యూయార్క్‌లో ఉదయం 6:35 నుంచి 7:12 వరకు, మసాచుసెట్స్‌లో 6:27 నుంచి 7:08 వరకు కనిపిస్తుంది. (మనకు రాత్రి అయ్యే సమయంలో అక్కడ సూర్యగ్రహణం ఉంటుంది) యూరప్‌లో ఐస్‌లాండ్, గ్రీన్‌లాండ్, పశ్చిమ యూరప్, స్కాండినేవియన్ ద్వీపకల్పంలో ఉన్న ప్రాంతాల్లో ఈ గ్రహణం స్పష్టంగా ఉంటుంది. భారత కాలమానం ప్రకారం, గ్రహణం మధ్యాహ్నం 2:20 గంటలకు మొదలై, గరిష్ట స్థాయికి 4:17 గంటలకు చేరుకుని, 6:13 గంటలకు ముగుస్తుంది. కానీ ఈ సమయంలో భారతదేశంలో సూర్యుడు కనిపించే స్థితిలో ఉండడు కాబట్టి.. ఇక్కడ గ్రహణం చూడలేరు. అయితే, ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా భారతీయ ఖగోళ ఔత్సాహికులు ఈ సంఘటనను వీక్షించవచ్చు.

సూర్యగ్రహణాన్ని సురక్షితంగా చూడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నేరుగా సూర్యుడిని చూడటం కంటికి చాలా ప్రమాదకరం, రెటీనా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీని కోసం ISO 12312-2 ప్రమాణాలకు అనుగుణంగా ఉండే సర్టిఫైడ్ సోలార్ వ్యూయింగ్ గ్లాసెస్ ఉపయోగించాలి. సాధారణ సన్‌గ్లాసెస్ లేదా ఇంట్లో తయారు చేసిన ఫిల్టర్లు ఉపయోగించడం ప్రమాదకరం. గ్లాసెస్ లేకపోతే, పిన్‌హోల్ ప్రొజెక్టర్ వంటి పరోక్ష పద్ధతుల ద్వారా సూర్యుడి ప్రతిబింబాన్ని చూడవచ్చు. ఈ గ్రహణం సమయంలో సూర్యుడు చంద్రుడి వెనుక భాగం నుంచి కొంత మాత్రమే కనిపిస్తాడు, దీనిని పాక్షిక సూర్యగ్రహణం అంటారు.

భారతదేశంలో ఈ గ్రహణం కనిపించకపోయినా, విజ్ఞాన శాస్త్రవేత్తలకు ఇది ముఖ్యమైన అవకాశం. సూర్యుడిని అధ్యయనం చేయడం, సౌర గాలులు, అంతరిక్ష వాతావరణంపై దాని ప్రభావాన్ని అర్థం చేసుకోవడం దీని ద్వారా సాధ్యమవుతుంది. భారతీయ అంతరిక్ష సంస్థ ఇస్రో కూడా ఈ సంఘటనను పరిశీలిస్తోంది. ఇక భారతదేశంలో కనిపించే సూర్యగ్రహణం 2031 మే 21న ఉంటుంది, అది కేరళ, తమిళనాడులో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ గ్రహణం అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News