న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(Kejriwal)ను ఓడించిన బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ(Parvesh Verma) ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పశ్చిమ ఢిల్లీ నుంచి ఆయన ఎంపీగా ఉన్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ శర్మ కుమారుడైన పర్వేశ్ వర్మ కేంద్రమంత్రిగానూ పనిచేశారు. తాజాగా ఆయన ఢిల్లీలో బీజేపీ గెలుపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ప్రజలు ప్రధాని మోడీపై తమ విశ్వాసాన్ని చూపించారన్నారు. తన గెలుపునకు కారణమైన మోడీకి, ఢిల్లీ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు.
కాగా 1977లో జన్మించిన పర్వేశ్ వర్మ.. ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్శిటీలోని కిరోరి మాల్ కాలేజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందారు. అనంతరం ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ చదివారు. 2013లో మెహ్రౌలీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఢిల్లీ శాసనసభలో విజయం సాధించడంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014లో పశ్చిమ ఢిల్లీ ఎంపీగా గెలిచారు. 2019లోనూ ఇదే స్థానం నుంచి దాదాపు 5.78లక్షల ఓట్లతో విజయం సాధించి రికార్డు సృష్టించారు.