Passenger Gives Birth to Baby Boy Onboard: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. థాయ్‌లాండ్‌కు చెందిన ఓ మహిళ విమానంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో తొలుత షాక్‌కి గురైన ప్రయాణికులు ప్రవసం అనంతరం ఊపిరి పీల్చుకున్నారు. డెలివరీ సాఫీగా జరిగినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
మస్కట్ నుండి ముంబైకి బయలుదేరిన విమానంలో ఈ సంఘటన జరిగింది. గర్భవతి అయిన థాయ్‌లాండ్‌కు చెందిన మహిళా ప్రయాణికురాలు విమానం గాల్లో ఉండగానే పురిటి నొప్పులతో బాధపడటం మొదలుపెట్టింది. పరిస్థితిని గమనించిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ క్యాబిన్ సిబ్బంది వెంటనే స్పందించారు. అదృష్టవశాత్తూ, విమానంలో ఉన్న ఓ డాక్టర్ మరియు నర్సు ప్రసవానికి సహాయం అందించారు. దీంతో విమానం ముంబైలో ల్యాండ్ అవ్వడానికి ముందుగానే మహిళ సురక్షితంగా బిడ్డకు జన్మనిచ్చింది.
తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే, తల్లీబిడ్డలను వెంటనే అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
సాధారణంగా గర్భిణులు విమాన ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా చివరి దశలో ప్రయాణాలను నివారించాలని వైద్యులు సూచిస్తుంటారు.


