IndiGo crisis: దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో (IndiGo) విమాన సేవలకు వరుసగా నాలుగో రోజు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేల మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో పడిగాపులు కాస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సంక్షోభం సుప్రీంకోర్టు( Supreme Court)కు చేరింది. విమాన సర్వీసుల రద్దుపై సర్వోన్నత న్యాయస్థానంలో పిల్(PIL) దాఖలైంది. దీనిపై తక్షణమే విచారణ జరపాలని పిటిషనర్ సుప్రీంకోర్టు కోరారు. స్టేటస్ రిపోర్ట్ సమర్పించేలా పౌరవిమానయాన మంత్రిత్వశాఖ, డీజీసీఏను ఆదేశించాలని కోరారు. దీంతో సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
రంగంలోకి దిగిన రైల్వే: శనివారం దిల్లీ నుంచి నడిచే వందల కొద్ది దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో దిల్లీ ఎయిర్‌పోర్టు కీలక ప్రకటన విడుదల చేసింది. సర్వీసుల పునరుద్ధరణ జరుగుతోందని తెలుపుతూ.. కొన్ని సరీసులు మాత్రం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ప్రయాణికుల సమస్యను పరిష్కరించేందుకు రైల్వే సైతం రంగంలోకి దిగింది. సాధ్యమైనంత త్వరగా ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు 37 రైళ్లకు 116 బోగీలను జోడించినట్లుగా తెలుస్తోంది.
దర్యాప్తుకు ఆదేశం: సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరో ఐదు నుంచి పది రోజులు పట్టవచ్చని ఇండిగో సీఈవో పీటర్ ఎల్బెర్స్ తెలిపారు. అయితే ఈ అంతరాయంపై కేంద్రం సీరియస్ అయింది. పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. రానున్న మూడు రోజుల్లో సర్వీసులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనలు, షెడ్యూలింగ్ నెట్‌వర్క్‌ను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. అన్ని విమానయాన సంస్థలు నిబంధనలు సరిగా పాటిస్తున్నాయో.. లేదో నిర్ధరిస్తామని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడ, ఎలా తప్పు జరిగిందో తెలుసుకోవడానికి ఒక విచారణ కమిటీని సైతం ఏర్పాటుచేశామని పేర్కొన్నారు.
Also Read:https://teluguprabha.net/top-stories/indigo-crisis-effect-on-lionel-messi-hyderabad-tour/
డీజీసీఏ కీలక నిర్ణయం: విమాన సర్వీసుల అంతరాయం నేపథ్యంలో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల జారీచేసిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) ఉత్తర్వులను తాత్కాలికంగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. పైలట్లలో అలసట సమస్యను తగ్గించేందుకు.. వారికి వారంలో విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచుతూ డీజీసీఏ ఇటీవల నిబంధనలు తీసుకొచ్చింది. దీని ప్రకారం వీక్లీ విశ్రాంతిని, సెలవులను వేర్వేరుగా పరిగణించాలి. ఇండిగో విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతున్నందున వీక్లీ విశ్రాంతి నిబంధనను తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ప్రయాణికులు తమ విమాన స్టేటస్‌ను తెలుసుకోవాలని.. అందుకు అనుగుణంగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

