Gen Z support for BJP : భారత రాజకీయ యవనికపై ‘జెన్-జీ’ (1997-2012 మధ్య జన్మించిన యువత) ఓటరు ఎటువైపు మొగ్గు చూపుతున్నారనే చర్చ ముమ్మరంగా సాగుతున్న వేళ, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయెల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “దేశ యువశక్తి ఎప్పుడూ నరేంద్ర మోదీ నాయకత్వానికే జై కొడుతోంది” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ముంబైలో మీడియా సమావేశంలో మాట్లాడిన పీయూశ్ గోయెల్, నరేంద్ర మోదీ హ్యాట్రిక్ ప్రధానిగా విజయం సాధించడం వెనుక నవయుగ యువత (Gen Z) పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. “యువత శక్తి, జెన్-జీ అచంచల మద్దతు లేకుండా ప్రధాని మోదీ వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం సాధ్యమయ్యేది కాదు” అని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి వర్గం మోదీ దార్శనికతకు తోడు నీడలా నిలుస్తోందని, దేశాభివృద్ధిలో యువత ముందంజలో ఉందని చెప్పారు.
‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్’: నవ శకానికి నాంది : దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల నివారణకు ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ భారీ ఉద్యమం యువతను సన్మార్గంలో నడిపించేందుకు అగ్నికి ఆజ్యం పోసినట్లు నిలిచిందని గోయెల్ ప్రశంసించారు. 28 వేలకు పైగా ప్రాంతాల నుంచి దాదాపు కోటి మందికి పైగా యువతతో ప్రధాని వర్చువల్ విధానంలో మాట్లాడి, నషా ముక్తి ప్రమాణం చేయించారు. గతంలో కాశీలో పైలట్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమానికి ఇప్పుడు 125కు పైగా ఆధ్యాత్మిక సంస్థలు హారతి పట్టి భాగస్వాములవుతున్నాయి. ఈ అభియాన్ కేవలం ఒక్క రోజుతో ముగిసేది కాదు; రాబోయే 100 వారాల పాటు ప్రతీ ఆదివారం వాకథాన్‌లు, యోగా, క్రీడా పోటీలు, వీధి నాటకాల ద్వారా జన భాగస్వామ్య ఉద్యమంగా ము ముందుకు సాగుతుంది.
మోదీ పిలుపు: “కల ఓడిపోకూడదు.. కుటుంబం నశించకూడదు” మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాన్ని ప్రధాని అత్యంత భావోద్వేగంగా వివరించారు. “ఒక్క యువకుడు డ్రగ్స్ బారిన పడినా.. కేవలం ఆ వ్యక్తి మాత్రమే కాదు, ఒక కల ఓడిపోతుంది; ఒక కుటుంబం చిన్నభిన్నమవుతుంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకోవాలంటే దేశ యువత శారీరకంగా దృఢంగా, మానసికంగా ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉండటం అత్యంత ఆవశ్యకమని నొక్కి చెప్పారు.
ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు: యువతలో ప్రధాని మోదీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భయపడుతున్నారని గోయెల్ వ్యాఖ్యానించారు. గతంలో రాహుల్ గాంధీ తనను తాను యువ నాయకుడిగా వర్ణించుకున్నప్పటికీ, ఇప్పుడు ఆ స్థాయిలో ఆయనకు జనాదరణ లేదనే విషయం తేలిపోయిందని ఎద్దేవా చేశారు. పేపర్ లీకేజీలను నిరోధించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన చట్టాలను సమర్థిస్తూ, విపక్షాలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేస్తున్నాయని గోయెల్ స్పష్టం చేశారు.

