Global Innovation Engine: గత దశాబ్దంలో కోవిడ్-19 వంటి సంక్షోభాలు ప్రపంచ సరఫరా వ్యవస్థలలోని బలహీనతలను కళ్ళకు కట్టినట్టు చూపించాయి. ఈ నేపథ్యంలో, కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. దేశ భవిష్యత్తు కోసం మనం కేవలం ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే నినాదానికే పరిమితం కాకుండా, దీర్ఘకాలిక వృద్ధికి, సార్వభౌమత్వానికి దోహదపడే సరికొత్త ‘స్వదేశీ’ విధానాన్ని అవలంబించాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, స్థిరమైన సరఫరా వ్యవస్థ, కీలక సాంకేతికతలపై నియంత్రణ, కొన్ని దేశాలపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించుకోవడం చాలా ముఖ్యమని గోయల్ నొక్కి చెప్పారు.
టెక్నాలజీపై స్వీయ నియంత్రణే కీలకం
“సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధాలు, ఇంధన వనరుల విషయంలో విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమే దేశాభివృద్ధికి కీలకం,” అని గోయల్ స్పష్టం చేశారు. ఒకప్పుడు ప్రపంచానికి ‘బ్యాక్ ఆఫీస్’ లేదా సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్‌గా మాత్రమే ఉన్న భారత్, ఇప్పుడు ‘ప్రపంచ ఆవిష్కరణల ఇంజిన్‌గా’ మారాలని నిర్ణయించుకుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే భారతీయ టెక్ స్టార్టప్‌లు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణను పొందుతున్నాయని తెలిపారు.
కేంద్రమంత్రి వ్యాఖ్యలు ముఖ్యంగా రెండు రంగాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.చమురు, అరుదైన ఖనిజాలు. వీటి కోసం భారత్ విదేశాలపై అధికంగా ఆధారపడుతోంది. సెమీకండక్టర్లుప్రపంచ అవసరాలలో 90 శాతం సరఫరా చేస్తున్న తైవాన్ వంటి దేశాలపై ఆధారపడటం దేశ భద్రత. ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారింది.
ఈ నేపథ్యంలోనే, సెమీకండక్టర్ల రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి కేంద్రం రూ. 1.6 లక్షల కోట్ల విలువైన 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులపై పెట్టుబడులు పెడుతోంది. అంతేకాకుండా, ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0’ ప్రకటించడం కూడా దేశాన్ని టెక్నాలజీ సార్వభౌమత్వం వైపు తీసుకెళ్లేందుకు బలమైన చర్యగా నిలుస్తోంది. ‘ఆత్మనిర్భర్ భారత్’ కేవలం తయారీకి సంబంధించినది కాదు, అది భారతదేశ భవిష్యత్తుకు భద్రత మరియు స్థిరత్వాన్ని ఇచ్చే మంత్రం అని పీయూష్ గోయల్ సందేశం స్పష్టం చేస్తోంది.


