Homeనేషనల్GDP: 7.8 శాతం భారత ఆర్థికవృద్ధి పట్ల ప్రధాని హర్షం

GDP: 7.8 శాతం భారత ఆర్థికవృద్ధి పట్ల ప్రధాని హర్షం

తాష్కెంట్(తెలుగుప్రభ): భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధి సాధించడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు అభినందనలు తెలిపిన ఆయన.. స్వావలంబన భారత్‌ కోసం స్వదేశీ వస్తువులు, సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలని మరోసారి పిలుపునిచ్చారు. అవసరం లేని విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లు, బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని సూచించారు. కిర్గిస్థాన్‌ నుంచి మంగళవారం ఉదయం ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియోలో మోడీ మాట్లాడుతూ.. ‘‘7.8 శాతం వృద్ధి దేశంలో ఆనందాన్ని నింపింది. ఇది ప్రజల సంకల్పబలం, కష్టానికి, సమష్టి శక్తికి నిదర్శనం’’ అని అన్నారు. ప్రపంచం యుద్ధాలు, సంక్షోభాలతో సతమతమవుతున్న వేళ.. సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నప్పటికీ భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి అంచనాలను మించి 7.8 శాతంగా నమోదైంది. ఇరాన్‌ యుద్ధం, అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా నిలవడం విశేషమని మోడీ అన్నారు. ‘‘పర్యటనల కోసం విదేశాలకు వెళ్లొద్దు. విదేశాల్లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లు నిర్వహించకండి. ‘వెడ్‌ ఇన్‌ ఇండియా’ అనే మంత్రాన్ని పాటిద్దాం. అవసరం లేకపోతే బంగారం కొనొద్దు’’ అని ప్రధాని సూచించారు. స్థానికంగా తయారయ్యే వస్తువులు, సేవలను ఎంత ఎక్కువగా ఎంచుకుంటే దేశం అంత వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

- Advertisement -

స్వావలంబనకు ప్రాధాన్యం కొనసాగిస్తే.. స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ను యువతకు అందించగలమనే నమ్మకం తనకు ఉందన్నారు. దేశ ఆర్థిక వృద్ధిని ప్రజలు ఉత్సాహంగా జరుపుకోవడంతో పాటు ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్య సాధనకు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. 140 కోట్ల మంది భారతీయులు ఐక్యంగా పనిచేస్తే దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లగలమని పేర్కొన్నారు. ఈ ఏడాది మేలోనూ మోడీ స్వావలంబన కోసం ప్రజల సమష్టి భాగస్వామ్యాన్ని కోరారు. అంతర్జాతీయ సంక్షోభాల కారణంగా సరఫరా అంతరాయాలు, ధరల పెరుగుదల వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు సాధ్యమైన చోట్ల వర్క్‌ ఫ్రం హోమ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని, పెట్రోల్‌, డీజిల్‌ వినియోగాన్ని తగ్గించాలని, ప్రజా రవాణాను ఉపయోగించాలని సూచించారు. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచడంతో పాటు అనవసర విదేశీ ప్రయాణాలు, విదేశీ వివాహాలకు దూరంగా ఉండాలని, అవసరం లేని బంగారం కొనుగోళ్లను తగ్గించి ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ ఉత్పత్తులను ప్రోత్సహించాలని అప్పట్లో కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News