PM Dhan Dhanya Yojana scheme: రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం ధన్ ధాన్య యోజన పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం, రైతుల ఆదాయం పెంచడం కోసం ఈ పథకాన్ని కేంద్రం తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ కార్యక్రమాలను సైతం నిర్వహించనున్నారు. ఈ పథకం 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి మొదలై ఆరేళ్ల పాటు అమల్లో ఉండనుంది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ. 24,000 కోట్లు కేటాయించింది. దీంతో సుమారు 1.7 కోట్ల మంది రైతులకు నేరుగా ప్రయోజనం పొందనున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.
100 జిల్లాలు ఎంపిక: వ్యవసాయ రంగంలో వెనుకబడిన 100 జిల్లాల్లో ఉత్పాదకతను పెంచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. పంటల వైవిధ్యతను ప్రోత్సహించడం మరియు రైతుల ఆదాయాన్ని పెంచడం కోసం మోదీ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. పీఎం ధన్ ధాన్య యోజన పథకం అమలుతో పాటుగా పర్యవేక్షణ కోసం ఇప్పటికే కొంతమంది అధికారులను సైతం ఎంపిక చేశారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసువెళ్లాలనే ఉద్దేశ్యంతో కేంద్రం దీనిని ప్రవేశపెట్టింది.
Also Read: https://teluguprabha.net/national-news/central-government-introduce-ai-in-school-curriculum/
తెలుగు రాష్ట్రాలలో ఎంపికైన జిల్లాలు: ఈ పథకం తొలి దశలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా తెలంగాణలో కొన్ని జిల్లాలను ఎంపిక చేశారు. ఏపీలో అల్లూరి సీతారామరాజు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాలు ఎంపిక కాగా.. తెలంగాణలో జనగామ, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
పథకం ద్వారా రైతులకు కలిగే లబ్ధి: మొదటి దశలో ఎంచుకున్న జిల్లాల్లో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం కోసం.. పంటల వైవిధ్యతతో పాటు సుస్థిర వ్యవసాయ పద్ధతులను కేంద్రం ప్రోత్సహిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేయడానికి గ్రామ పంచాయతీ, బ్లాక్ స్థాయిలో కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలను పెంచనున్నారు. మెరుగైన నీటిపారుదల సౌకర్యాలను కల్పించనున్నారు. అంతేకాకుండా రైతులకు స్వల్పకాలిక వ్యవసాయ రుణాలతో పాటుగా దీర్ఘకాలిక రుణాల లభ్యతను మోదీ ప్రభుత్వం మెరుగుపరచనుంది.


