Pradhan Mantri Fasal Bima Yojana extended : ఆరుగాలం శ్రమించే అన్నదాతకు ప్రకృతి కరుణిస్తేనే పంట చేతికొస్తుంది. కానీ, తీరా కోత కోసి ఇంటికి తెచ్చుకున్నాక కూడా అకాల వర్షాలు, మార్కెట్ మాయాజాలం వారిని వెంటాడుతూనే ఉంటాయి. కేవలం పంటలే కాదు, అనుబంధ రంగాలైన పాడి పశువులు, చేపల పెంపకం కూడా ప్రకృతి వైపరీత్యాలకు బలైపోతూ రైతును నిలువునా ముంచుతున్నాయి. ఈ కష్టాలకు చెక్ పెడుతూ, రైతుకు మరింత భరోసానిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పంటల బీమా పథకమైన ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)’ పరిధిని భారీగా విస్తరించింది. ఇకపై ఈ పథకం కేవలం పంటలకే కాకుండా, పాడి, ఆక్వా రంగాలకూ రక్షణ కవచంగా నిలవనుంది. అసలు ఈ విస్తరణ వల్ల రైతులకు, పశుపోషకులకు, మత్స్యకారులకు కలిగే పూర్తి ప్రయోజనాలేంటి..? కృత్రిమ మేధను ఉపయోగించి ఈ పథకం రూపురేఖలను ఎలా మార్చబోతున్నారు..?
విత్తనం నుంచి విక్రయం వరకు.. సమగ్ర భరోసా : ఇప్పటివరకు ఫసల్ బీమా యోజన పంట నష్టానికి మాత్రమే పరిహారం అందించేది. కానీ, పంట కోసిన తర్వాత కూడా రైతులకు ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. చాలామంది రైతులు తమ ధాన్యాన్ని పొలాల్లోనో, ఇళ్ల వద్దనో నిల్వ ఉంచుతారు. అలాంటి సమయంలో అకాల వర్షాలు కురిస్తే పంట మొత్తం తడిసి ముద్దవుతుంది. మార్కెట్‌కు తీసుకెళ్లినా సరైన ధర రాక నిల్వ ఉంచితే నష్టం వాటిల్లుతుంది. ఈ వాస్తవ సమస్యలను గుర్తించిన కేంద్రం, “కోతల అనంతరం రైతు తన మొత్తం పంటను అమ్ముకునే వరకు” ఈ బీమా పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. ఇది రైతులకు కొండంత అండనిచ్చే నిర్ణయం.
వ్యవసాయ అనుబంధ రంగాలకూ విస్తరణ : వ్యవసాయంతో పాటు పాడి పశువులను, చేపల పెంపకాన్ని నమ్ముకున్న రైతులు ఎందరో. వరదలు, పిడుగుపాట్ల వంటి విపత్తుల సమయంలో పశు సంపదను కోల్పోయి వీధిన పడుతున్నారు. ఆక్వా రైతులదీ ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో పశుపోషకులు, మత్స్యకారుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఈ పథకాన్ని వ్యవసాయ అనుబంధ రంగాలైన పశు సంపదకు, ఆక్వాకు కూడా వర్తింపజేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
కృత్రిమ మేధతో పారదర్శక సేవలు : ఈ పథకం అమలులో జాప్యాన్ని, అవకతవకలను నివారించడానికి కేంద్రం టెక్నాలజీని ఆయుధంగా వాడుకోనుంది. క్లెయిమ్‌ల సత్వర చెల్లింపు, పంట నష్టం అంచనాలలో పారదర్శకత కోసం ‘కృత్రిమ మేధ’ (Artificial Intelligence)ను ఉపయోగించనుంది.
జియో ట్యాగింగ్: బీమా చేసిన ప్రతి రైతు భూమికి జియో ట్యాగింగ్ చేసి, ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా పంట పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.
రియల్ టైం డేటా: పంటల రియల్ టైం ఫోటోలు, వాతావరణ సమాచార నెట్‌వర్క్‌ల ద్వారా నష్టాన్ని కచ్చితంగా అంచనా వేస్తారు.
ఆన్‌లైన్ నమోదు: రైతులు పీఎంఎఫ్‌బీవై వెబ్‌సైట్ ద్వారా నేరుగా నమోదు చేసుకోవచ్చు, తమ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ సాంకేతికత జోడింపుతో క్లెయిమ్‌ల పరిష్కార ప్రక్రియ వేగవంతం కావడమే కాకుండా మరింత పారదర్శకంగా మారనుంది.
ప్రపంచ యవనికపై ‘ఫసల్ బీమా’ : ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసింది. ప్రతి ఏటా సుమారు 4 కోట్ల మంది రైతుల నమోదుతో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పంటల బీమా పథకం. ప్రీమియం పరంగా చూస్తే ప్రపంచంలోనే మూడో అతి పెద్దది. ఇప్పటివరకు ఈ పథకం కింద చెల్లించిన మొత్తం క్లెయిమ్‌లు రూ.1.59 లక్షల కోట్లు కాగా, రైతులు చెల్లించిన ప్రీమియం వాటా కేవలం రూ.32,270 కోట్లు మాత్రమే. ఈ నూతన విస్తరణలతో ఫసల్ బీమా యోజన, కేవలం పంటలకే కాకుండా యావత్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఒక సమగ్రమైన ఆర్థిక రక్షణ కవచంగా మారనుంది.


