PM Kisan : కేంద్ర బడ్జెట్ 2026లో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులు ఎంతో ఆశగా ఎదురుచూసిన పీఎం కిసాన్ (PM-Kisan) నిధుల పెంపు అంశంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టతనిచ్చారు. సాగు ఖర్చులు భారంగా మారుతున్న తరుణంలో, రైతులకు అందే పెట్టుబడి సాయాన్ని పెంచుతారని వెలువడిన వార్తలకు ఈ బడ్జెట్ ప్రసంగంతో తెరపడింది.
నిరాశపరిచిన పీఎం కిసాన్ నిధుల పెంపు
గత కొన్ని నెలలుగా సామాజిక మాధ్యమాల్లో, రాజకీయ వర్గాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని ఏడాదికి రూ. 6,000 నుండి రూ. 8,000 లేదా రూ. 10,000 వరకు పెంచుతారనే బలమైన ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఎరువులు, విత్తనాలు , డీజిల్ ధరలు పెరగడంతో సాగు పెట్టుబడి కోసం కేంద్రం అదనపు సాయం అందిస్తుందని రైతులు ఆశించారు. అయితే, నేడు లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి, ఈ పథకం కింద అందుతున్న ప్రస్తుత సాయంలో ఎటువంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేశారు. పాత పద్ధతిలోనే అర్హులైన రైతులకు ఏడాదికి రూ. 6,000 మాత్రమే అందుతాయి.
నిధుల విడుదల , అమలు తీరు
ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం, ఈ రూ. 6,000 పెట్టుబడి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం మూడు సమాన విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2,000 చొప్పున నేరుగా నగదు బదిలీ (DBT) పద్ధతిలో రైతుల బ్యాంక్ ఖాతాలకు చేరుతున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తూ, దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 11 కోట్ల మందికి పైగా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా బడ్జెట్‌లో తగినన్ని నిధులను కేటాయించారు. నిధుల పెంపు లేకపోయినప్పటికీ, పథకం ఎక్కడా ఆగకుండా నిరంతరాయంగా కొనసాగుతుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
SAP CEO Christian Klein : AI సాంకేతికత వల్ల ఆ ఉద్యోగాలు గోవిందా
తెలంగాణ రైతాంగంపై ప్రభావం
ఈ నిర్ణయం తెలంగాణలోని రైతుపై కూడా గణనీయమైన ప్రభావం చూపనుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30.77 లక్షల మంది రైతులు పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెట్టుబడి సాయంతో పాటు, కేంద్రం నుండి అందే ఈ రూ. 6,000 నిధులు రైతులకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయి. నిధులు పెరుగుతాయని ఆశించిన ఇక్కడి రైతులకు ఈ బడ్జెట్ కొంత నిరాశ కలిగించినప్పటికీ, కేంద్రం ప్రకటించిన ఇతర వ్యవసాయ అనుబంధ పథకాలు , కొత్త సాంకేతిక పరిజ్ఞానం (AI టూల్స్) ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది.
ఆదాయం పెంపునకు ప్రత్యామ్నాయ మార్గాలు
నేరుగా నగదు పంపిణీని పెంచనప్పటికీ, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం ఇతర మార్గాలపై దృష్టి సారించింది. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడం, నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి కోల్డ్ స్టోరేజీల నిర్మాణం, , డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ద్వారా రైతులకు మార్కెట్ విశ్లేషణను అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యలను బడ్జెట్‌లో ప్రస్తావించారు. ‘భారత్ విస్తార్’ వంటి సాంకేతిక వేదికల ద్వారా సాగు ఖర్చులను తగ్గించి, రైతులకు పరోక్షంగా ఆర్థిక వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Weather updates: పగలు భానుడి ప్రతాపం.. రాత్రి వణికిస్తున్న చలి!

