India-China SCO Summit 2025 : గత కొన్నేళ్లుగా సరిహద్దు ఉద్రిక్తతలతో అప్రకటిత యుద్ధ వాతావరణంలో ఉన్న ప్రపంచంలోని రెండు అతిపెద్ద దేశాల మధ్య సయోధ్యకు మార్గం సుగమమవుతోందా? ఇరు దేశాల సంబంధాల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడనుందా? అవుననే సంకేతాలిస్తూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య కీలక దౌత్యపరమైన ముందడుగు పడింది. భారత పర్యటనకు వచ్చిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ద్వారా అందిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సు ఆహ్వానాన్ని ప్రధాని మోదీ స్వీకరించారు. గల్వాన్ ఘర్షణల తర్వాత నెలకొన్న ఉద్రిక్తతల నడుమ, ఈ తాజా పరిణామం ఇరు దేశాల మధ్య మంచును కరిగిస్తుందా? సరిహద్దు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందా?
జిన్‌పింగ్ ఆహ్వానం.. మోదీ అంగీకారం : భారత పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి, కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వాంగ్ యీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, చైనాలోని టియాంజిన్‌లో జరగనున్న ఎస్‌సీఓ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాల్సిందిగా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పంపిన వ్యక్తిగత ఆహ్వానాన్ని మోదీకి అందజేశారు. ఈ ఆహ్వానాన్ని ప్రధాని మోదీ సాదరంగా స్వీకరించి, సదస్సుకు హాజరయ్యేందుకు తన అంగీకారాన్ని తెలిపారు.
ఈ సమావేశం అనంతరం ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.
“వాంగ్ యీని కలవడం ఆనందంగా ఉంది. గతేడాది కజాన్‌లో అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయినప్పటి నుంచి ఇరుదేశాల సంబంధాలు స్థిరమైన పురోగతిని సాధించాయి. ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలు, సున్నితమైన అంశాలను గౌరవించుకోవడం ద్వారానే ఇది సాధ్యమైంది. టియాంజిన్‌లో జరిగే ఎస్‌సీఓ సదస్సులో జిన్‌పింగ్‌తో మరోసారి సమావేశం కోసం ఎదురుచూస్తున్నాను”
– ప్రధాని నరేంద్ర మోదీ
సరిహద్దుపై వెనక్కి తగ్గేదేలే : ఒకవైపు చైనాతో స్నేహం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, దేశ సార్వభౌమాధికార పరిరక్షణ విషయంలో ఏ మాత్రం రాజీపడేది లేదని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఆయన ఈ వ్యాఖ్యలతో భారత వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. వాంగ్ యీతో భేటీ సందర్భంగా, వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి శాంతి, ప్రశాంతతను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. సరిహద్దు సమస్యకు న్యాయమైన, సహేతుకమైన మరియు పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనడానికి భారతదేశం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
ఫలించిన దౌత్య చర్చలు : ప్రధానితో భేటీకి ముందు, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆ వెంటనే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తో కలిసి 24వ ప్రత్యేక ప్రతినిధుల భేటీకి హాజరయ్యారు. ఈ చర్చలన్నీ సానుకూల వాతావరణంలో జరిగాయని ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు చైనాలో జరిగే ఎస్‌సీఓ సదస్సుకు ప్రధాని మోదీ హాజరవుతున్నట్లు అజిత్ డోభాల్ అధికారికంగా ప్రకటించారు.


