PM Modi Announces Nuclear Power Sector Opening for Private Players: భారతదేశ ఇంధన చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలవుతోంది. ఇన్నాళ్లు కేవలం ప్రభుత్వ గుత్తాధిపత్యంలో, అత్యంత కట్టుదిట్టమైన నియంత్రణలో ఉన్న అణు విద్యుత్ రంగం (Nuclear Power Sector) త్వరలోనే ప్రైవేట్ పరం కానుంది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) గురువారం నాడు ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే The Atomic Energy Bill, 2025 ను ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టమైంది. దేశ ఇంధన సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, ప్రైవేట్ సంస్థలకు (Private Players)కు ఈ రంగంలో ద్వారాలు తెరుస్తున్నట్లు మోదీ ప్రకటించారు.
హైదరాబాద్ వేదికగా కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్‌లోని స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) సంస్థ వారి ‘ఇన్ఫినిటీ క్యాంపస్’ను వర్చువల్ విధానంలో ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తూ.. “మేము అణుశక్తి రంగాన్ని కూడా ప్రైవేట్ భాగస్వామ్యానికి తెరుస్తున్నాం. ఈ రంగంలో ప్రైవేట్ సెక్టార్ బలమైన పాత్ర పోషించేలా పునాదులు వేస్తున్నాం” అని మోదీ స్పష్టం చేశారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలు ఎలాగైతే అద్భుతాలు సృష్టిస్తున్నాయో, అణుశక్తిలోనూ అదే జరగాలని ప్రభుత్వం భావిస్తోంది.
లక్ష్యం: 2047 నాటికి 100 గిగావాట్లు!
ప్రస్తుతం మన దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కేవలం 8.8 గిగావాట్లు (GW) మాత్రమే ఉంది. దీనిని 2047 నాటికి ఏకంగా 100 గిగావాట్లకు పెంచాలని కేంద్రం భారీ టార్గెట్ పెట్టుకుంది. అంటే ప్రస్తుతమున్న దానికి పది రెట్లు ఎక్కువన్నమాట. ఇది కేవలం ప్రభుత్వ నిధులతో సాధ్యం కాదు కాబట్టి, ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. దీనివల్ల ‘స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు’ (Small Modular Reactors), అడ్వాన్స్డ్ రియాక్టర్ల తయారీలో కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయి. అణు సంబంధిత ఆవిష్కరణల్లో భారత్ సాంకేతిక నాయకత్వం వహించడానికి ఇది దోహదపడుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
చట్టం ఏం చెబుతోంది? మార్పులేంటి?
వాస్తవానికి, 1962 నాటి అణుశక్తి చట్టం (Atomic Energy Act, 1962) ప్రకారం.. అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసే అధికారం, నడిపే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి లేదా కేంద్రం స్థాపించిన కార్పొరేషన్లకు మాత్రమే ఉంది. ప్రైవేట్ సంస్థలే కాదు, కనీసం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇందులో నేరుగా పాల్గొనడానికి వీల్లేదు. అందుకే, ఈ పాత నిబంధనలను మారుస్తూ కొత్త బిల్లును ఈ శీతాకాల సమావేశాల్లో తీసుకురాబోతున్నారు. ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగంలోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రక్రియ కార్యరూపం దాల్చుతోంది. మొత్తానికి, అణుశక్తి రంగం ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తే విద్యుత్ కొరత తీరుతుందా? భద్రతా పరమైన సవాళ్లు ఎలా ఉంటాయి? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

