PM Modi West Bengal development projects : పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఊపునిచ్చింది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆదివారం హుగ్లీ జిల్లాలో సుమారు రూ.830 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కోల్‌కతాను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే మూడు కొత్త అమృత్ భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపి, ప్రయాణికులకు శుభవార్త అందించారు. అసలు ఈ ప్రాజెక్టులతో బెంగాల్ ముఖచిత్రం ఎలా మారనుంది..? ఈ కొత్త రైళ్లు ఏయే ప్రాంతాలను కలుపనున్నాయి..?
సింగూర్‌లో ప్రధాని.. అభివృద్ధికి శ్రీకారం : హుగ్లీ జిల్లా సింగూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు.
“కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులన్నీ పశ్చిమ బెంగాల్ అభివృద్ధిని వేగవంతం చేస్తాయి. అభివృద్ధి చెందిన తూర్పు భారతాన్ని నిర్మించడమే మా లక్ష్యం,” అని ఈ సందర్భంగా ప్రధాని స్పష్టం చేశారు.
మూడు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం : కోల్‌కతాను దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో కలిపే మూడు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు.
హౌరా – ఆనంద్ విహార్ టెర్మినల్ (ఢిల్లీ)
సీల్దా – బనారస్ (వారణాసి)
శాంత్రాగచ్చి – తాంబరం (చెన్నై)
ఈ కొత్త రైలు సర్వీసులు, ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనున్నాయి.
బాలాఘర్ పోర్టుతో కొత్త శకం : హుగ్లీ జిల్లాలోని బాలాఘర్‌లో ‘ఎక్స్‌టెండెడ్ పోర్ట్ గేట్ సిస్టమ్’ నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇది రాష్ట్ర సరుకు రవాణా రంగంలో ఓ కీలక ముందడుగు.
విశాలమైన టెర్మినల్: సుమారు 900 ఎకరాల విస్తీర్ణంలో, అంతర్గత జలరవాణా (IWT) టెర్మినల్, రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌తో దీనిని నిర్మించనున్నారు. ఏటా సుమారు 2.7 మిలియన్ టన్నుల సరుకును నిర్వహించే సామర్థ్యంతో దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు, కోల్‌కతా వంటి నగరాల్లోని రద్దీ కారిడార్ల నుంచి నౌకల రాకపోకలను మళ్లించి, సరుకు రవాణా సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరచనుంది.
కొత్త రైలు మార్గం ప్రారంభం : ఈ పర్యటనలో భాగంగా, ప్రధాని కొత్తగా నిర్మించిన జయరాంబటి-బారోగోపీనాథ్‌పూర్-మేనాపూర్ రైలు మార్గాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం, మేనాపూర్, జయరాంబటి మధ్య నడిచే రైలుకు పచ్చజెండా ఊపారు. ఈ కొత్త ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక, రవాణా రంగాలకు కొత్త ఉత్తేజాన్ని అందిస్తాయని, తూర్పు భారత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.

