Thursday, February 20, 2025
Homeనేషనల్Tamilnadu: తమిళనాడు రాజకీయాల్లో ప్రధాని మోడీ కార్టూన్ ప్రకంపనలు

Tamilnadu: తమిళనాడు రాజకీయాల్లో ప్రధాని మోడీ కార్టూన్ ప్రకంపనలు

వచ్చే ఏడాది తమిళనాడు(Tamilnadu)లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్షాలు ఇప్పటి నుంచే రాజకీయాలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే ప్రముఖ తమిళ వెబ్‌సైట్ వికటన్ రూపొందించిన ప్రధాని మోడీ(PM Modi) కార్టూన్ తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ వెబ్‌సైట్‌ను కేంద్రం బ్లాక్ చేయడంపై అధికార డీఎంకే, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్రం భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తోందని మండిపడ్డారు. తక్షణమే వెబ్ సైట్‎ను పునరుద్ధరించాలని సీఎం స్టాలిన్(Stalin)డిమాండ్ చేశారు.

- Advertisement -

మరోవైపు టీవీకే పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్(Vijay) కూడా కేంద్రంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను బీజేపీ అణివేస్తోందని విమర్శించారు. కంటెంట్‎కు సంబంధించిన సమస్యలు ఉంటే అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలే తప్ప పూర్తిగా వెబ్ సైట్‎ను బ్లాక్ చేయడం సరికాదన్నారు.

అటు బీజేపీ నేతలు ఈ విమర్శలకు ధీటుగా సమాధానమిస్తున్నారు. వికటన్ మీడియాపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్ర సమాచార ప్రసార సహయ మంత్రి ఎల్ మురుగన్‌కు ఫిర్యాదు చేశామని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తెలిపారు. అధికార డీఎంకే పార్టీ కనుసన్నల్లో నడిచే వికటన్ సంస్థపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ నాయకుడిని అప్రతిష్టపాలు చేసే పత్రికా స్వేచ్ఛ వార్త పత్రికలకు ఎట్టి పరిస్థితుల్లో ఉండదని పేర్కొన్నారు.

అసలు ఏం జరిగిందంటే.. డొనాల్డ్ ట్రంప్ రెండో సారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టాక అక్రమ వలసదారులను తిరిగి వారి దేశాలకు పంపిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను కూడా ప్రత్యేక విమానంలో ఇండియాకు పంపించారు. అయితే భారతీయుల కాళ్లు, చేతులకు బేడీలు వేసి పంపించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీని ఆధారంగా వికటన్ వెబ్‌సైట్ వ్యంగ్యంగా కార్టూన్ రూపొందించింది. ఇందులో ప్రధాని మోడీ కాళ్లు, చేతులకు సంకెళ్లు వేయగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నవ్వుతున్నారు. ఈ కార్టూన్ వైరల్‎గా మారడంతో వికటన్ వెబ్ సైట్‎ను కేంద్రం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News