అమెరికాకు చెందిన ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రధాని మోదీ(PM Modi) క్రీడలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రీడలకు మాత్రమే ప్రపంచాన్ని ఉత్తేజపరిచే శక్తి ఉందని తెలిపారు. అందుకే తాను క్రీడలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. అలాగే భారత్‌లో ఫుట్‌బాల్‌కు కూడా విపరీతమైన ఆదరణ ఉందన్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాదోల్ జిల్లాలో ఫుట్‌బాల్‌కు ఉన్న ప్రేమ తనను ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపారు. అక్కడ నాలుగు తరాలుగా ఫుట్‌బాల్ ఆడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా యాంకర్ మీ ఫేవరెట్ ఫుట్‌బాల్ ప్లేయర్ ఎవరని అడగగా.. డియెగో మారడోనా అని వెల్లడించారు. ఇప్పటి తరంలో మాత్రం లియోనెల్ మెస్సీని అందరూఇష్టపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇక భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌పై స్పందించిన మోడీ.. బెస్ట్ టీమ్‌ను ఫలితాలే నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. అలాగే భారత్ – పాకిస్థాన్ జట్లలో ఏది ఉత్తమం? అనే ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. తానేమి క్రికెట్ ఎక్స్‌పర్ట్‌ను కాదని గేమ్ టెక్నికల్ విషయాలు తనకు తెలియవని చెప్పారు.