PM Modi Emplanes For Maldives: మాల్దీవుల 60వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ మేరకు లండన్ పర్యటన ముగించుకొని గురువారం మాల్దీవులకు బయలుదేరారు మోదీ. దాదాపు రెండు సంవత్సరాల క్రితం “ఇండియా అవుట్” ప్రచారంతో అధికారంలోకి వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు పాలనలో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
పర్యటన వ్యూహాత్మకమేనా..?
మాల్దీవులు భారతదేశానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైన పొరుగు దేశం. బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, మాల్దీవులు వంటి దేశాలతో ఇప్పటికే మైత్రిని బలోపేతం చేసుకుంటూ భారత్‌కు ముప్పు పెంచుతోంది చైనా. ఈ క్రమంలోనే భారత్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. చిన్న దేశమైనా మాల్దీవులతో సఖ్యత ముఖ్యమని భావించి ఆ దేశంతో మైత్రి కొనసాగించాలనే చూస్తోంది.
తోక జాడించినా.. ఓర్పుతోనే..
ముయిజ్జు పాలనలో మాల్దీవుల నుంచి భారత సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయడం, చైనా వైపు మొగ్గు చూపడం వంటి చేష్టలకు పాల్పడినా భారత్ సంయమనం పాటిస్తూ వచ్చింది. చైనాతో ముప్పు నేపథ్యంలో వ్యూహాత్మకంగా మాల్దీవుల అభివృద్ధికి భారత్ సహాయాన్ని కొనసాగించింది.
స్నేహం.. బలోపేతం..
మోదీ పర్యటన ఇరు దేశాల మధ్య మైత్రీబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రక్షణ, ఆర్థిక, వాణిజ్య రంగాల్లో మరింత పెంపొందించేందుకు దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జులై 26న జరగనున్న మాల్దీవుల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ద్వారా, రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత బంధాలను, పరస్పర గౌరవాన్ని ప్రధాని మోదీ చాటిచెప్పనున్నారు.
ఈ పర్యటనలో ప్రధాని మోడీ మాల్దీవుల అధ్యక్షుడు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, భద్రతకు సంబంధించి ఇరు దేశాలు సహకరించుకునే మార్గాలపై కూడా దృష్టి సారించనున్నారు.


