Saturday, July 12, 2025
Homeనేషనల్PM Modi Tour: జూలై 2 నుంచి ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటన

PM Modi Tour: జూలై 2 నుంచి ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటన


PM Modi Five Nation Tour:
భారత ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటన ఖరారైంది. జులై 2 నుంచి జులై 9వ తేదీ వరకు ఘనా, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటించనున్నారని విదేశాంగ శాఖ వెల్లడించింది. జూలై 2, 3 తేదీల్లో ఆఫ్రికా దేశం ఘనాలో పర్యటించనున్నారు. తొలిసారిగా ప్రధాని హోదాలో ఆ దేశంలో అడుగుపెట్టనున్నారు. దీంతో మూడు దశాబ్దాల తరువాత ఘనాలో పర్యటిస్తున్న భారత ప్రధానిగా మోదీ నిలవనున్నారు. ఘనా పర్యటనలో ఆర్థిక, ఇంధన, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలపై ఆ దేశ అధ్యక్షుడితో ప్రధాని చర్చలు జరపనున్నారు.

ఆ తర్వాత జూలై 3, 4వ తేదీల్లో రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటించనున్నారు. 1999 తర్వాత భారత ప్రధాని ఆ దేశం వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పర్యటనలో భాంగా ట్రినిడా్ అండ్ టొబాగో పార్లమెంట్ సంయుక్త సమావేశంలో మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది.

ఇక జులై 4- 5 తేదీల్లో అర్జెంటీనాలో పర్యటించనున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఆయన చర్చించనున్నారు. అనంతరం జులై 5-8 తేదీల్లో ప్రధాని మోదీ బ్రెజిల్‌లో పర్యటించనున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా ఆహ్వానం మేరకు 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో మోదీ పాల్గొననున్నారు.

చివరగా జులై 9న నమీబియాలో ప్రధాని మోదీ పర్యటిస్తారు. తొలిసారి నమీబియాకు వెళ్తున్న మోదీ ఆ దేశ అధ్యక్షుడు న్దైత్వాతో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. నమీబియా దేశ వ్యవస్థాపక పితామహుడు దివంగత డాక్టర్ సామ్ నుజోమాకు నివాళులర్పించనున్నారు. తదుపరి నమీబియా పార్లమెంటులో ప్రధాని ప్రసంగిస్తారు.

మొత్తానికి ఐదు దేశాల పర్యటనలో ప్రధాని మోదీ బిజీబిజీగా గడపనున్నారు. ఇటీవల జీ7 సమావేశాల్లో భాగంగా కెనడాలో పర్యటించిన సంగతి తెలిసిందే. అంతకుముందు సైప్రస్ తో పాటు క్రొయేషియా దేశాల్లోనూ పర్యటించారు.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News