PM Modi Ghana Tour: ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటనలో ప్రస్తుతం బిజీ బీజీగా ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా పశ్చిమ ఆఫ్రికా దేశమైన ఘనా చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షుడు జాన్ డ్రామానీ మహామా ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆ దేశ రాజధాని అక్రాలోని ఓ హోటల్ కు చేరుకున్న మోదీకి కొంతమంది పిల్లలు భారతీయ జెండాలతో స్వాగతం పలుకుతూ హరే రామ హరే కృష్ణ నినాదాలు చేస్తూ సందడి చేశారు. మోదీని చూసేందుకు ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున తరలివచ్చారు
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీని ఆ దేశ అత్యున్నత పురస్కారంతో అక్కడి ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. తనకు లభించిన ఈ గౌరవాన్ని భారతీయులకు అంకితం చేశారు. తనను గౌరవంగా సత్కరించిన ఆ దేశ ప్రభుత్వానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్షుడు మహామాతో పాటు ఘనా ప్రభుత్వం, ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. 140 కోట్ల భారతీయుల తరపున తాను ఈ గౌరవాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నానని పేర్కొన్నారు. ఈ అవార్డును ఇరు దేశాల మధ్య నెలకొన్న గొప్ప సాంస్కృతిక, సంప్రదాయాలకు, చారిత్రక సంబంధాలకు అంకితం చేస్తున్నాను అని వెల్లడించారు. మూడు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఘనాను సందర్శించడం ఇదే తొలిసారి.
అంతకుముందు ఘనా అధ్యక్షుడు మహామాతో ప్రధాని మోదీ సమావేశం నిర్వహించారు. ఇరు దేశాల అధికారులు నాలుగు ఒప్పందాలపై సంతకం చేశారు. ఈ సందర్భంగా భారత్-ఘనా మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించారు. రెండు దేశాలు బలమైన ప్రజాస్వామ్య దేశాలని.. ఘనా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించడం గొప్ప గౌరవంగా భావిస్తానని మోదీ వెల్లడించారు. కాగా ఘనాలో 15,000 మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారు. ఏడు దశాబ్దాలకు పైగా నివసిస్తున్న కొందరు ఆ దేశ పౌరసత్వాన్ని కూడా అందుకున్నారు.
ఘనా పర్యటన అనంతరం జులై 3, 4 తేదీల్లో ట్రినిడాడ్ అండ్ టొబాగో, జులై 4,5 తేదీలత్లో అర్జెంటీనా, జులై 8వ తేదీన 17వ బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. చివరగా జులై 9వ తేదిన నమీబియాలో పర్యటిస్తారు. కాగా ఇటీవలే మోదీ కెనడాలో జరిగిన జీ7 సమావేశంలో పాల్గొన్న సంగతి తెలిసిందే.