అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధి చేసిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను(Amrit Stations) ప్రధాని మోదీ (PM Modi) ప్రారంభించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా మొత్తం 18 రాష్ట్రాల్లో వీటిని తీర్చిదిద్దారు. ఈ స్టేషన్లను రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ స్టేషన్ల జాబితాలో తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్లు, ఏపీలోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ ఉన్నాయి.
ఆయా ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ రైల్వే స్టేషన్ల ముఖద్వారాలు, ప్రధాన భవనాల నిర్మాణం చేపట్టారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాళ్లు, టికెట్ బుకింగ్ కౌంటర్లు, టాయిలెట్లను పునర్నిర్మించడంతో పాటు సైన్ బోర్డులు బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ పథకం కింద పురాతనమైన బేగంపేట రైల్వే స్టేషన్ రూపురేఖలు మారాయి.