Indian Mobile Congress 2025 : ఒకప్పుడు విలాసంగా భావించిన ఇంటర్నెట్, ఇప్పుడు ప్రతి భారతీయుడి జీవితంలో భాగమైపోయింది. దేశంలో ఒక జీబీ డేటా ధర, ఒక కప్పు ఛాయ్ కంటే తక్కువకు లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. “మేక్ ఇన్ ఇండియా” నినాదాన్ని కొందరు పరిహసించినా, ఈరోజు మొబైల్ తయారీలో భారత్ ప్రపంచంలోనే ఓ శక్తిగా ఎదుగుతోందని ఆయన గర్వంగా ప్రకటించారు. అసలు గడిచిన దశాబ్దంలో మొబైల్ రంగంలో భారత్ సాధించిన ప్రగతి ఎంత..? ప్రపంచ పెట్టుబడిదారులకు ప్రధాని ఇచ్చిన పిలుపు వెనుక ఉన్న బలమేమిటి..?
దేశ రాజధాని ఢిల్లీలో 9వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సును బుధవారం ప్రారంభించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, డిజిటల్ ఇండియా సాధించిన విజయాలను, భవిష్యత్ లక్ష్యాలను ఆవిష్కరించారు. ఒకప్పుడు 2జీ స్పెక్ట్రమ్ కోసం పోరాడిన దేశం, ఇప్పుడు దాదాపు ప్రతి జిల్లాకు 5జీ సేవలను విస్తరించిందని, ఇది మారిన భారత్ సత్తాకు నిదర్శనమని అన్నారు. పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు, “మేక్ ఇన్ ఇండియా”కు ఇదే సరైన తరుణమని ప్రపంచ పెట్టుబడిదారులకు ఆయన పిలుపునిచ్చారు.
దశాబ్ద కాలంలో అద్భుత ప్రగతి: “పదేళ్ల క్రితం నేను ‘మేక్ ఇన్ ఇండియా’ అన్నప్పుడు కొందరు నన్ను చూసి నవ్వారు. భారత్ అత్యాధునిక సాంకేతికతను ఎలా తయారు చేస్తుందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే, వారి హయాంలో కొత్త టెక్నాలజీ దేశంలోకి రావడానికి దశాబ్దాలు పట్టేది. కానీ, ఈరోజు ఆ అనుమానాలన్నింటికీ దేశ ప్రజలు సమాధానం ఇచ్చారు,” అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. గత దశాబ్ద కాలంలో మొబైల్ ఫోన్ల తయారీ రంగం సాధించిన ప్రగతిని ఆయన అంకెలతో వివరించారు.
మొబైల్ ఫోన్ల తయారీ: 28 రెట్లు వృద్ధి
మొబైల్ ఫోన్ల ఎగుమతులు: 127 రెట్లు పెరుగుదల.
ఉపాధి: ఈ రంగం ద్వారా ప్రత్యక్షంగా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి.
డేటా వినియోగం: అత్యంత చౌక ధరలకు డేటా లభిస్తుండటంతో, డేటా వినియోగంలో ప్రపంచంలోని పెద్ద దేశాల సరసన భారత్ నిలిచింది.
ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి: దేశీయ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి అంచనాలు ఆరు రెట్లు పెరిగాయి.
సాంకేతిక స్వాతంత్ర్యం దిశగా అడుగులు: కేవలం వినియోగంలోనే కాకుండా, సాంకేతికత రూపకల్పనలోనూ భారత్ ఆత్మనిర్భరత సాధిస్తోందని ప్రధాని అన్నారు. “కొన్ని రోజుల క్రితం భారత్‌లోనే రూపొందించిన 4జీ టెక్నాలజీని ప్రారంభించాం. ఫలితంగా, సొంతంగా ఈ సాంకేతికతను కలిగిన ప్రపంచంలోని ఐదు దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది. ఇది సాంకేతిక స్వాతంత్ర్యం దిశగా మనం వేస్తున్న బలమైన అడుగు,” అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ మద్దతుతో పరిశ్రమలు, స్టార్టప్‌లు కలిసికట్టుగా పనిచేస్తూ ప్రతి రంగంలోనూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయని తెలిపారు. సెమీకండక్టర్ల ఉత్పత్తి నుంచి మొబైల్ టెక్నాలజీ వరకు ప్రతి రంగంలో భారత్ దూసుకుపోతోందని, 4జీ, 5జీ సాంకేతికతలతో దేశంలోని ప్రతి పౌరుడికి నిరంతరాయ ఇంటర్నెట్ సేవలు అందిస్తామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. అక్టోబర్ 8 నుంచి 11 వరకు ఈ సదస్సు జరగనుంది.


