Homeనేషనల్Awareness : మత్తుపై మహోద్యమం.. యువతరం భవితకు ప్రధాని ‘నశా ముక్త్’ పిలుపు

Awareness : మత్తుపై మహోద్యమం.. యువతరం భవితకు ప్రధాని ‘నశా ముక్త్’ పిలుపు

Nationwide 100-week anti-drug awareness campaign : భారతదేశానికి లభించిన అతిపెద్ద ఆయుధం శ్రమశక్తి, యువసంపత్తి. దేశ జనాభాలో అత్యధికంగా ఉన్న యువత సన్మార్గంలో పయనిస్తే ‘వికసిత్ భారత్ 2047’ కల సాకారమవ్వడం అసాధ్యమేమీ కాదు. అయితే, నిశ్శబ్దంగా విస్తరిస్తూ, నవతరం భవిష్యత్తును చిదిమేస్తున్న మత్తు మహమ్మారి నేడు దేశ ప్రగతికి అతిపెద్ద అడ్డంకిగా మారింది. యువశక్తిని ఈ రొంపి నుంచి కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త యుద్దానికి తెరతీసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్యక్షతన ‘వికసిత్ భారత్ కోసం మత్తు రహిత యువత సంకల్ప అభియాన్’  పేరుతో చారిత్రాత్మక ఉద్యమం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా దాదాపు 10,000 కేంద్రాల్లో ఏకకాలంలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఏకంగా కోటి మందికి పైగా యువకులు మత్తుపదార్థాలకు దూరంగా ఉంటామని ఒకే స్వరంతో ప్రతిజ్ఞ చేశారు. 

- Advertisement -

100 వారాల సుదీర్ఘ కార్యాచరణ: వారం వారం మహోద్యమం : మామూలుగా నిర్వహించే అవగాహన సదస్సుల కంటే భిన్నంగా, ఈ అభియాన్ ఒక సుదీర్ఘ ప్రణాళికతో ముందుకు వచ్చింది. రాబోయే 100 వారాల పాటు ప్రతీ ఆదివారం దేశవ్యాప్తంగా విస్తృత స్థాయి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

యువతలో ఉన్న అపరిమితమైన శక్తిని నిర్మాణాత్మక మార్గంలో మళ్లించేందుకు వీధి నాటకాలు, వాకథాన్లు, క్రీడా పోటీలు, ధ్యానం, యోగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. గ్రామ సభల నుంచి విశ్వవిద్యాలయాల వరకు ప్రతీ స్థాయిలో ప్రతి వారం ఒక ప్రత్యేక ఇతివృత్తంతో యువతను చైతన్యవంతం చేస్తారు. మత్తు అలవాటుకు యువత దాసోహమవడానికి ప్రధాన కారణాలు ఒత్తిడి, పర్యవేక్షణ లోపమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని మోదీ ఈ విషయంలో ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యుల బాధ్యతను ప్రత్యేకంగా గుర్తుచేశారు. పిల్లలలో వచ్చే చిన్న చిన్న ప్రవర్తనా మార్పులను తల్లిదండ్రులు ముందుగానే పసిగట్టాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ప్రవర్తన మారకముందే “తోడు నీడై” నిలవాలని పిలుపునిచ్చారు.తరగతి గది కేవలం చదువుకే పరిమితం కాకుండా విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని నూరిపోసే కేంద్రంగా మారాలి. ప్రతి పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయంలో క్రమం తప్పకుండా అవగాహన ర్యాలీలు, విద్యా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.

మై భారత్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్: కోటి మంది ‘నశా ముక్త్’ సంకల్పం : కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘మై భారత్’ (MY Bharat) పోర్టల్ ద్వారా ఈ సంచలన కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నారు. నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS), నెహ్రూ యువ కేంద్రాలు (NYKS), వివిధ విద్యార్థి సంఘాలతో పాటు 125కి పైగా ఆధ్యాత్మిక సంస్థలు ఈ ప్రచారంలో భాగస్వాములయ్యాయి. ప్రతిజ్ఞ చేసిన కోటి మంది యువతీ యువకులు కేవలం ప్రమాణానికే పరిమితం కాకుండా తమ ప్రాంతాల్లో ‘నశా ముక్త్ వాలంటీర్లుగా’ మారి ఇతరులకు మార్గదర్శకులుగా నిలుస్తారు.

ఉక్కుపాదంతో సరఫరా వ్యవస్థపై దాడి : మాదకద్రవ్యాల నిర్మూలనలో ‘డిమాండ్ తగ్గించడం’ ఒక ఎత్తయితే, ‘సరఫరా అడ్డుకోవడం’ మరొక ఎత్తు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) తాజా గణాంకాల ప్రకారం 2025లోనే దేశవ్యాప్తంగా రూ.1,980 కోట్ల విలువైన దాదాపు 1.34 లక్షల కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 42,000 ఎకరాలకు పైగా అక్రమ నల్లమందు సాగును ధ్వంసం చేశారు. ఒకవైపు చట్టపరమైన ఉక్కుపాదం మోపుతూనే, మరోవైపు సమాజంలో అవగాహన పెంచడమే ఈ అభియాన్ ప్రధాన లక్ష్యం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News