Saturday, November 15, 2025
Homeనేషనల్PM Krishi Yojana: రైతుల ముఖంలో ఆనందం చూడడమే మా లక్ష్యం- ప్రధాని మోదీ

PM Krishi Yojana: రైతుల ముఖంలో ఆనందం చూడడమే మా లక్ష్యం- ప్రధాని మోదీ

PM Dhanadhanya Krishi Yojana : అన్నదాత బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది.. వారి కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడేది లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దశాబ్దాలుగా రైతులను నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వాల వైఖరిని మార్చి, విత్తనం నుంచి విపణి వరకు తమ ప్రభుత్వం అండగా నిలిచిందని ఉద్ఘాటించారు. అసలు రైతుల కోసం ప్రధాని తాజాగా ప్రారంభించిన ఆ మహా పథకం ఏంటి..? దాని ద్వారా అన్నదాతల జీవితాల్లో ఎలాంటి మార్పు రాబోతోంది..? గత ప్రభుత్వాలపై మోదీ చేసిన విమర్శలేంటి..?

- Advertisement -

రైతుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యమని పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వారిని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా మరో రెండు చారిత్రక పథకాలకు శ్రీకారం చుట్టారు. లోక్‌నాయక్‌ జయప్రకాశ్ నారాయణ్‌ జయంతి సందర్భంగా దిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ వేదికగా, రూ.35,440 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘పీఎం ధనధాన్య కృషి యోజన’, ‘పప్పుధాన్యాల ఆత్మనిర్భరత’ పథకాలను దేశవ్యాప్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయం, పశుసంవర్ధకం, మత్స్య, ఆహార ప్రాసెసింగ్ రంగాలలో రూ.5,450 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు, రూ.815 కోట్ల విలువైన అదనపు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, “వికసిత భారత్ నిర్మాణంలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారు. మేం ఏ పథకం ప్రారంభించినా పేదలను, రైతులను దృష్టిలో పెట్టుకునే చేస్తాం. ఈ రోజు ప్రారంభించిన ఈ రెండు పథకాలు కోట్లాది మంది రైతుల జీవితాలను మార్చనున్నాయి,” అని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు దేశంలోని 100కు పైగా జిల్లాలను వెనుకబడినవిగా ముద్రవేసి వాటి అభివృద్ధిని గాలికొదిలేశాయని, కానీ ఎన్డీఏ ప్రభుత్వం వాటినే ‘ఆశావహ జిల్లాలు’గా మార్చి, వ్యవసాయాభివృద్ధికి ప్రత్యేక ప్రాజెక్టులను అమలు చేస్తోందని తెలిపారు.

గత ప్రభుత్వాలకు వ్యవసాయంపై దృక్పథమే లేదు: మోదీ : గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, దిశానిర్దేశం లేకపోవడం వల్లే దేశంలో వ్యవసాయ రంగం కుదేలైందని కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. “వ్యవసాయం మన అభివృద్ధి ప్రయాణంలో ఎప్పుడూ కీలకమే. కానీ దురదృష్టవశాత్తు గత ప్రభుత్వాలు రైతులను విస్మరించాయి. వారి వద్ద సరైన దృక్పథం లేదు. వ్యవసాయానికి సంబంధించిన వివిధ శాఖలు సమన్వయం లేకుండా తమదైన శైలిలో పనిచేయడంతో రైతన్న క్రమంగా బలహీనపడ్డాడు. 21వ శతాబ్దపు భారత్ వేగంగా అభివృద్ధి చెందాలంటే వ్యవసాయంలో సంస్కరణలు తప్పనిసరి అని భావించి, 2014లో ఆ పనికి శ్రీకారం చుట్టాం. విత్తనం నుంచి మార్కెట్‌ వరకు సమూల మార్పులు తీసుకొచ్చాం. ఆ మార్పుల ఫలాలే ఇప్పుడు దేశం అనుభవిస్తోంది,” అని అన్నారు.

11 ఏళ్లలో వ్యవసాయ ఎగుమతులు రెట్టింపు : గత 11 ఏళ్లలో తమ ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రధాని అంకెలతో సహా వివరించారు. “మా హయాంలో ధాన్యం ఉత్పత్తి సుమారు 90 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు పెరిగింది. పండ్లు, కూరగాయల ఉత్పత్తి 64 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు పైగా పెరిగింది. ఈ రోజు పాల ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో, చేపల ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది. తేనె, గుడ్ల ఉత్పత్తి 2014తో పోలిస్తే రెండింతలైంది. ఆరు పెద్ద ఎరువుల కర్మాగారాలను పునరుద్ధరించాం. 25 కోట్ల భూసార ఆరోగ్య కార్డులను రైతులకు అందించాం. సూక్ష్మ సేద్యం 100 లక్షల హెక్టార్లకు విస్తరించింది. అన్నింటికన్నా ముఖ్యంగా, పీఎం ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు రూ.2 లక్షల కోట్లకు పైగా బీమా క్లెయిమ్‌లను అందించాం. ఇది చిన్న విషయం కాదు,” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad