Saturday, November 15, 2025
Homeనేషనల్Manipur visit : మణిపూర్‌కు మోదీ.. మంటలు చల్లారేనా? శాంతి నెలకొనేనా?

Manipur visit : మణిపూర్‌కు మోదీ.. మంటలు చల్లారేనా? శాంతి నెలకొనేనా?

Prime Minister Modi’s Manipur visit:  ఏడాదిన్నరగా జాతుల వైరంతో రగిలిపోతూ, వందలాది ప్రాణాలను బలిగొని, వేలాది మందిని నిరాశ్రయులను చేసిన మణిపూర్‌ గడ్డపైకి ఎట్టకేలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అడుగుపెట్టనున్నారా…? అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. సెప్టెంబర్ రెండో వారంలో ప్రధాని మోదీ మణిపూర్‌లో పర్యటించి, అక్కడి పరిస్థితులను స్వయంగా సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త నిజమైతే, రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించే దిశగా కేంద్రం వేస్తున్న అతిపెద్ద ముందడుగు ఇదే అవుతుంది. మరి ఈ పర్యటనతో మణిపూర్ మంటలు చల్లారతాయా.? విడిపోయిన మనసులు తిరిగి కలుస్తాయా..? అక్కడి ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పడుతాయా..?

- Advertisement -

అగ్నిగుండంలా మణిపూర్.. ఎందుకీ పరిస్థితి : 2023 మే 3న మొదలైన కుకీ-జో, మైతేయ్ వర్గాల మధ్య ఘర్షణ మణిపూర్‌ను అగ్నిగుండంగా మార్చేసింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, 60,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లు, ఊళ్లు విడిచి శరణార్థులుగా మారారు. ఇంటర్నెట్‌పై ఆంక్షలు, కర్ఫ్యూలు నిత్యకృత్యమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, సైన్యాన్ని మోహరించి, రాష్ట్రపతి పాలన విధించినప్పటికీ, క్షేత్రస్థాయిలో హింస పూర్తిగా అదుపులోకి రాలేదు. రెండు వర్గాల మధ్య అపనమ్మకం గోడలు కట్టేసింది. ఈ నేపథ్యంలో, ప్రధాని ఎందుకు మణిపూర్‌ను సందర్శించడం లేదంటూ విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి.

పర్యటన ఉద్దేశం ఇదేనా : ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైతే, దాని వెనుక స్పష్టమైన లక్ష్యాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బాధితులకు భరోసా: మణిపూర్ హింస వల్ల సర్వం కోల్పోయిన కుటుంబాలను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పరామర్శించి, వారికి కేంద్రం అండగా ఉంటుందనే భరోసా కల్పించడం.

శాంతి చర్చలకు ఊతం: విడిపోయిన వర్గాల ప్రతినిధులతో చర్చలు జరిపి, వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించడం.

అధికారులతో సమీక్ష: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, పునరావాస కార్యక్రమాల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, కీలక ఆదేశాలు జారీ చేయడం.
రాజకీయంగానూ కీలకమే..

గత లోక్‌సభ ఎన్నికల్లో మణిపూర్‌లోని రెండు స్థానాల్లోనూ బీజేపీ ఓటమి చవిచూసింది. రాష్ట్రంలో నెలకొన్న అశాంతే దీనికి ప్రధాన కారణంగా విశ్లేషకులు భావించారు. ఈ నేపథ్యంలో, ప్రధాని పర్యటన ద్వారా రాష్ట్ర ప్రజల్లో తిరిగి నమ్మకాన్ని పాదుకొల్పాలని, పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కేవలం ఒక రాజకీయ పర్యటనగా మిగిలిపోకుండా, మణిపూర్‌లో శాంతి స్థాపనకు నాంది పలకాలని యావత్ దేశం ఆకాంక్షిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad