Saturday, November 15, 2025
Homeనేషనల్Shubhanshu Shukla : అంతరిక్షంలో జీవనం ఎలా... వ్యోమగామి శుక్లాను ఆసక్తిగా అడిగిన ప్రధాని...

Shubhanshu Shukla : అంతరిక్షంలో జీవనం ఎలా… వ్యోమగామి శుక్లాను ఆసక్తిగా అడిగిన ప్రధాని మోదీ!

Shubhanshu Shukla: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి విజయవంతంగా భూమికి తిరిగొచ్చిన తొలి భారత వ్యోమగామి, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. అంతరిక్షంలోని అద్భుతాలు, అక్కడి జీవనశైలిపై ప్రధాని సామాన్యుడిలా ప్రశ్నల వర్షం కురిపించారు. యుద్ధ విమాన కాక్‌పిట్‌కు, అంతరిక్ష కేంద్రానికి తేడా ఏంటి..? అసలు అక్కడ వ్యోమగాములు ఎలా జీవిస్తారు..? ప్రధాని అడిగిన ఈ ప్రశ్నలకు వ్యోమగామి శుభాంశు శుక్లా ఎలాంటి సమాధానాలు ఇచ్చారు..? ఈ భేటీ భారత అంతరిక్ష కార్యక్రమం ‘గగన్‌యాన్‌’కు ఏ విధంగా దిశానిర్దేశం చేయనుంది?

- Advertisement -

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తన యాత్రను పూర్తిచేసుకుని సురక్షితంగా భూమికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి వ్యోమగాములు ధరించే ప్రత్యేక జాకెట్‌లో వచ్చిన శుక్లాకు ప్రధాని మోదీ సాదర స్వాగతం పలికి, ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం భుజంపై చేయి వేసి నడుస్తూ ఆయన అంతరిక్ష యాత్ర అనుభవాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.

ప్రశ్నల వర్షం కురిపించిన ప్రధాని : ఈ భేటీలో ప్రధాని మోదీ, శుక్లాను పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. “అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వాతావరణం ఎలా ఉంటుంది? యుద్ధ విమానంలోని కాక్‌పిట్ కంటే ఎక్కువ స్థలం ఉంటుందా?” అని ఆరా తీశారు. దీనికి ప్రతిస్పందనగా, శుక్లా అంతరిక్ష కేంద్రంలో తాము ఎదుర్కొన్న పరిస్థితులు, శూన్య గురుత్వాకర్షణ వాతావరణానికి అలవాటు పడిన తీరు, అలాగే తాను నిర్వహించిన ప్రయోగాలను ప్రధానమంత్రికి కూలంకషంగా వివరించారు. అంతరిక్షం నుంచి తీసిన కొన్ని అద్భుతమైన చిత్రాలను చూపిస్తూ వాటి ప్రాముఖ్యతను వివరించారు.

గగన్‌యాన్‌పై ప్రపంచ దేశాల ఆసక్తి : భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ‘గగన్‌యాన్’ మిషన్‌పై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొని ఉందని శుక్లా ప్రధానికి తెలిపారు. ఎందరో శాస్త్రవేత్తలు, వ్యోమగాములు ఈ మిషన్‌లో భాగస్వాములు కావడానికి ఉత్సాహం చూపుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ, భవిష్యత్ అంతరిక్ష కార్యక్రమాల అవసరాల దృష్ట్యా సుమారు 40 నుంచి 50 మంది వ్యోమగాములతో కూడిన పటిష్టమైన బృందాన్ని సిద్ధం చేయాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కి చెప్పారు.

అమూల్యమైన కానుకలు: ఈ సమావేశం చివరన, శుభాంశు శుక్లా తాను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన త్రివర్ణ పతాకాన్ని, తన యాత్రకు గుర్తుగా యాక్సియమ్-4 మిషన్‌కు సంబంధించిన జ్ఞాపికను ప్రధాని నరేంద్ర మోదీకి బహూకరించారు. ఈ ఆత్మీయ భేటీకి సంబంధించిన చిత్రాలను, వీడియోలను పీఎంఓ విడుదల చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad