PM Modi’s address on Operation Sindoor : ఎర్రకోట సాక్షిగా, ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం మరోసారి దేశ ప్రజల్లో నూతనోత్సాహాన్ని నింపడమే కాకుండా, శత్రు దేశాలకు గట్టి హెచ్చరికలు పంపింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ గురించి ఆయన ప్రస్తావించినప్పుడు యావత్ దేశం గర్వంతో పులకించింది. “ఊహించని రీతిలో దెబ్బతీశాం” అంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్‌కు సూటి హెచ్చరికగా నిలిచాయి. ఇంతకీ, ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని ఇంకేం చెప్పారు.? సైన్యానికి ఇచ్చిన స్వేచ్ఛ ఎలాంటిది..? అణు బెదిరింపులపై ఆయన స్పందన ఏమిటి.?
వీర జవాన్లకు వందనం.. శత్రువులకు స్పష్టమైన సందేశం : 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తన ప్రసంగంలో ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రత్యేక స్థానం కల్పించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న వీర జవాన్ల ధైర్యసాహసాలకు సెల్యూట్ చేసే అవకాశం తనకు దక్కిందని పేర్కొంటూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పహల్గాంలో మతం పేరుతో అమాయకులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులకు మన సైన్యం తగిన గుణపాఠం చెప్పిందని, వారిని ఊహకు అందని రీతిలో దెబ్బతీసిందని మోదీ అన్నారు.
“త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం” : పహల్గాం దాడి తర్వాత దేశ ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహ జ్వాలల ఫలితమే ‘ఆపరేషన్ సిందూర్’ అని ప్రధాని అభివర్ణించారు. ఏప్రిల్ 22న జరిగిన ఆ దారుణ మారణహోమం తర్వాత, భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. “లక్ష్యాన్ని, సమయాన్ని ఎంచుకునే స్వేచ్ఛను త్రివిధ దళాలకే ఇచ్చాం. దశాబ్దాలుగా జరగనిది మన సైన్యం చేసి చూపించింది” అని మోదీ తెలిపారు. శత్రు భూభాగంలోకి వందల కిలోమీటర్లు చొచ్చుకెళ్లి, ఉగ్రవాద శిబిరాలను మన సైనికులు మట్టిలో కలిపేశారని ఆయన గర్వంగా ప్రకటించారు.
“పాకిస్థాన్‌కు ఇంకా నిద్రపట్టడం లేదు” : ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్థాన్ ఇప్పటికీ తేరుకోలేకపోతోందని ప్రధాని ఎద్దేవా చేశారు. “పాకిస్థాన్‌కు ఇంకా నిద్రపట్టడం లేదు. అక్కడ ఎంత భారీ నష్టం జరిగిందంటే, రోజుకో కొత్త సమాచారం బయటపడుతోంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కరతాళ ధ్వనుల మధ్య మార్మోగాయి. ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని సమర్థించే వారిని వేర్వేరుగా చూసే ప్రసక్తే లేదని, మానవాళి మనుగడకే ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
అణు బెదిరింపులకు భయపడం : పాకిస్థాన్ నుంచి తరచూ ఎదురయ్యే అణు బెదిరింపుల అంశాన్ని కూడా ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. “న్యూక్లియర్ బెదిరింపులకు భారత్ భయపడదనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్పాం. శత్రు మూకలను ఎప్పుడు, ఎలా మట్టుబెట్టాలో మన సైన్యమే నిర్ణయిస్తుంది. లక్ష్యాన్ని చేరే సమయాన్ని కూడా సైన్యమే నిర్దేశిస్తుంది” అని ఆయన తేల్చిచెప్పారు. ఇది నూతన భారత్ అని, తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి చర్యకైనా వెనుకాడదని ఆయన ప్రపంచానికి గట్టి సందేశం పంపారు.


