Thursday, October 31, 2024
Homeనేషనల్PM Modi: ఏక్తా దివాస్.. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు ప్రధాని మోదీ ఘన నివాళి

PM Modi: ఏక్తా దివాస్.. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు ప్రధాని మోదీ ఘన నివాళి

PM Modi| జాతీయ ఐక్యతా దినోత్సవం (Ekta Diwas) పురస్కరించుకుని ఉక్కు మనిషి, భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్‌(Sardar Vallabhbhai Patel)కు ప్రధాని మోదీ(PM Modi) ఘన నివాళులు అర్పించారు. పటేల్ 150వ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ (Statue of Unity) విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం సర్దార్ పటేల్ సేవల్ని గుర్తు చేసుకుంటూ జాతి సమగ్రత కోసం ప్రతిజ్ఞ చేశారు. దేశ ఐకమత్యమే తమ ప్రభుత్వం విధానం అంటూ ప్రమాణం చేశారు. ఈ క్రమంలోనే త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ నేపథ్యంలో జవాన్లు చేసిన అద్భుత విన్యాసాలు వీక్షకులను అబ్బురపరిచాయి. మహిళ, పురుష సిబ్బంది బైక్‌లతో చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతకుముందు పటేల్‌ విగ్రహంపై భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ బృందం పూలవర్షం కురిపించింది. ఈ విన్యాసాలకు ముగ్దులైన ప్రధాని మోదీ సాయుధ బలగాలకు సెల్యూట్ చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిలో దేశ సమైక్యత స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహ నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా రైతుల పొలాల్లో వాడే పరికరాల నుంచి లోహాన్ని సేకరించి తీసుకొచ్చామన్నారు. దేశంలోని ప్రతి మూల నుంచి ఇక్కడికి మట్టిని తీసుకొచ్చామని.. ఇక్కడ ఏక్తా నర్సరీ ఉందన్నారు. దీనిలో ప్రపంచంలోని చాలా అడవుల నుంచి తెచ్చిన మొక్కలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే ఇక్కడ ఏక్తా మాల్‌లో దేశంలోని హస్తకళలు అమ్మకానికి ఉన్నాయన్నారు. ప్రతి రాష్ట్ర రాజధానిలో ఇలాంటి మాల్స్‌ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం నీతి, నిబద్ధతల్లో వివక్ష భావాలు దేశ సమైక్యతను దెబ్బతీశాయని విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి స్కీమ్‌లో, ప్రతి విధానంలో, ప్రతి నిబద్ధతలో ఐకమత్యమే కనిపిస్తుందని.. దీనిని చూసి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఆత్మ తమను ఆశీర్వదిస్తుందని వెల్లడించారు.

కాగా 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31న జాతీయ సమైక్యతా దినోత్సంగా జరుపుకుంటున్నారు. దీనిని రాష్ట్రీయ ఏక్తా దివస్ అని కూడా పిలుస్తారు. 2018లో గుజరాత్‌లోని కేవడియా ప్రాంతంలో 182 మీటర్ల ఎత్తులో ఉండే పటేల్‌ భారీ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద స్టాచ్యూగా గుర్తింపు సాధించింది.

ఇదిలా ఉంటే దేశ ప్రజలకు ప్రధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. “ఈ దివ్యమైన దీపాల పండుగ వేళ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషంగా, అదృష్టవంతులుగా జీవించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ లక్ష్మీ దేవి, శ్రీ గణేషుని అనుగ్రహం పొందాలని ప్రార్థిస్తున్నాను” అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News