IndiGo Crisis: ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo Airlines) కార్యకలాపాల సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీసుకున్న సమయానుకూల, సమర్థవంతమైన చర్యలకుగాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించినట్లు సమాచారం. ఇండిగో వ్యవహారంలో ప్రయాణికులకు మేలు జరిగేలా, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వేగంగా నిర్ణయాలు తీసుకున్నందుకు ప్రధాని, మంత్రిని అభినందించారు. విమర్శలను పట్టించుకోకుండా, బాధ్యతతో ముందుకు సాగాలని సూచించినట్లు తెలిసింది. మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ మొత్తం అంశంపై ఎప్పటికప్పుడు ప్రధాని కార్యాలయానికి పూర్తి సమాచారాన్ని అందించినట్లు సమాచారం.
నిబంధనల అమలులో యాజమాన్య వైఫల్యం
ఈ సంక్షోభానికి ప్రధాన కారణం ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనల ఉల్లంఘనేనని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కొత్త ఎఫ్‌డీటీఎల్ నిబంధనలను నవంబర్ 1వ తేదీ నుంచే అమలు చేస్తున్నట్లు ఇండిగో సంస్థ డీజీసీఏ (DGCA), పౌర విమానయాన శాఖలకు సమాచారం అందించింది. డిసెంబర్ 1 వరకు కార్యకలాపాలు సజావుగానే సాగినప్పటికీ, డిసెంబర్ 3వ తేదీ నుంచి ఒక్కసారిగా విమానాల రద్దు (Flight Cancellations) , ఆలస్యాలు మొదలయ్యాయి.
Also Read :CM Chandrababu – వైసీపీ పాలన దెబ్బకు ఏపీ బ్రాండ్ దెబ్బతింది
అధికారుల అంచనా ప్రకారం, ఇండిగో వద్ద సుమారు 2260 మంది పైలట్లు అందుబాటులో ఉన్నప్పటికీ, కొత్త నిబంధనలకు అనుగుణంగా వారికి డ్యూటీ షెడ్యూల్స్ (Duty Schedules) రూపొందించడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైంది. ఈ సంక్షోభానికి ఇది పూర్తిగా యాజమాన్య తప్పిదమేనని, సంస్థాగత లోపాలే కారణమని అధికార వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. దీనిపై ఇండిగోపై కఠిన చర్యలు తప్పవని భావిస్తున్నారు.
షోకాజ్ నోటీసు, తదుపరి చర్యలు
ఈ తీవ్రమైన అంతరాయాలపై ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌కు (Pieter Elbers) షోకాజ్ నోటీసు జారీ చేయబడింది. దీనికి సమాధానం ఇచ్చేందుకు ఆయన గడువు కోరినట్లు అధికారులు తెలిపారు. సీఈవో నుంచి వివరణ అందిన తర్వాత, సమస్య యొక్క పూర్తి తీవ్రతను అంచనా వేసి, డిజిసిఎ (DGCA) తదుపరి చర్యలను మొదలుపెట్టనుంది. ప్రయాణికుల రక్షణ, విమానయాన భద్రత విషయంలో రాజీ పడబోమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ పరిణామంతో ఇండిగో మార్కెట్ బ్రాండ్‌తో పాటు, ఇతర విమానయాన సంస్థలు కూడా తమ ఎఫ్‌డీటీఎల్ నిబంధనల అమలుపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది.

