భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్(Ashwin) ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దీంతో అశ్విన్ నిర్ణయంపై సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎన్నో కీలక మ్యాచుల్లో అశ్విన్ పోరాటపటిమను గుర్తు చేసుకున్నారు. దీంతో భారత క్రికెట్‌కు అందించిన సేవలకుగాను ఖేల్ రత్న అవార్డుతో సత్కరించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా భారత ప్రధాని మోదీ(PM Modi) సైతం అశ్విన్‌ను అభినందిస్తూ ప్రత్యేకంగా ఓ లేఖ రాశారు. అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిందంటూ లేఖలో పేర్కొన్నారు.
లేఖలో ప్రధాని ఏం చెప్పారంటే..
‘‘ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు మీ రిటైర్మెంట్ నిర్ణయంపై ఆశ్చర్యానికి గురయ్యారు. ఎన్నో ఆఫ్ బ్రేక్స్, క్యారమ్ బంతులతో ప్రత్యర్థులను హడలెత్తించారు. ఇప్పుడు మీరు ప్రకటించిన వీడ్కోలు నిర్ణయం కూడా క్యారమ్ బాల్ మాదిరిగా ఉంది. మీ నిర్ణయం భారత క్రికెట్‌తో పాటు ప్రపంచం కూడా ఆశ్చర్యపోయింది. అయితే ఇలాంటి ప్రకటన చేయడం కూడా అత్యంత కఠినమని అందరికీ తెలుసు.
భారత్ కోసం అద్భుతమైన ప్రదర్శన చేశారు. అందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున్నా. జట్టు కోసం వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టావు. మీ అమ్మగారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా జట్టు కోసం ఆలోచించారు. చెన్నై వరదలు వచ్చినప్పుడు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఇక నుంచి జెర్సీ నంబర్ 99ని మేం మిస్ కాబోతున్నాం. భవిష్యత్తులో మంచి ప్రయాణం సాగాలని కోరుకుంటున్నాను’’ అని మోదీ వెల్లడించారు.