భారత ప్రధాని నరేంద్ర మోడీకి శనివారం శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారం “మిత్ర విభూషణ” ప్రదానం చేశారు. రెండు దేశాల మధ్య సాంస్కృతిక, చారిత్రక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా శ్రీలంక ప్రభుత్వం ఈ గౌరవాన్ని ఇచ్చింది.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ స్పందిస్తూ.. ఇది తాను గర్వకారణమైన క్షణం అని పేర్కొన్నారు. తనకు వ్యక్తిగత గౌరవం మాత్రమే కాకుండా.. 140 కోట్ల భారతీయుల గౌరవమని తెలిపారు. ఈ పురస్కారం రెండు దేశాల మధ్య ఉన్న లోతైన స్నేహానికి, చారిత్రక బంధానికి చిహ్నమని పేర్కొన్నారు. అవార్డు అందించిన శ్రీలంక అధ్యక్షుడు, ప్రభుత్వం, ప్రజలతో మోడీ ప్రత్యేక కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.
ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ తొలిసారిగా శ్రీలంకను సందర్శించారు. ఇదే సమయంలో శ్రీలంక ప్రధాని అనుర కుమార దిస్సానాయకే భారతదేశానికి తన తొలిపర్యటన చేశారు. ఈ పరస్పర పర్యటనలు రెండు దేశాల మధ్య ఉన్న ఆత్మీయతను, గాఢమైన సంబంధాలను ప్రతిబింబిస్తున్నాయి.
2019లో జరిగిన ఉగ్రదాడులు, కరోనా వైరస్ మహమ్మారి సమయంలో భారత్ శ్రీలంకకు ఇచ్చిన సహాయం గుర్తు చేస్తూ మోడీ, ఆ సంఘటనల సమయంలో భారతదేశం తలపెట్టిన మైత్రీభావాన్ని మరోసారి గుర్తు చేశారు. ప్రధాని మోడీకి ఇప్పటి వరకు వివిధ దేశాల నుండి 22 అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. అందులో “మిత్ర విభూషణ” అత్యంత గౌరవనీయమైనదిగా నిలిచింది. ఈ పురస్కారం రెండు దేశాల మధ్య ఉన్న మైత్రి, సహకారానికి ప్రతీకగా నిలుస్తుంది.