One nation-One Election| త్వరలోనే దేశంలో జమిలి ఎన్నికలు(One nation-One Election), యూనిఫాం సివిల్ కోడ్(Uniform civil code) అమలు చేసి తీరుతామని ప్రధాని మోదీ(PM Modi) స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ దిశగా పని చేస్తుందని.. ఇది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందన్నారు. అలాగే ‘యూనిఫాం సివిల్ కోడ్’ సైతం అమల్లోకి వచ్చి తీరుతుందని తేల్చిచెప్పారు. ఈ రెండింటిని అడ్డుకోవడానికి దేశంలో కల్లోలం సృష్టించాలని కొన్ని శక్తులు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. కుల, మత, వర్గాల పేరుతో దేశాన్ని ముక్కలు చేసేందుకు చూస్తున్నాయని మండిపడ్డారు.
ఆర్టికల్ 370(Article 370) ముగిసిపోయిన అధ్యాయమని.. అభివృద్ధికి అడ్డుగా మారిందనే దానిని తొలగించామని మోదీ తెలిపారు. ప్రాంతీయ భాషల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. దేశంలో కల్లోలం సృష్టించాలనుకునే అర్బన్ నక్సల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని గట్టిగా హెచ్చరించారు. గత పదేళ్లుగా సరిహద్దుల్లో చొరబాట్లను భద్రతా బలగాలు అడ్డుకోవడంతో పాటు వారిని మట్టుబెడుతున్నాయని గుర్తుచేశారు. ఇకపై దేశభద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ప్రధాని వెల్లడించారు.
అయితే జమిలి ఎన్నికలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) తోసిపుచ్చారు. మోదీ ఏది చెప్పినా అది చేయరని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో ఏకాభిప్రాయం లేకుండా జమిలి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమన్నారు. ఈ అంశం చాలా రాష్ట్రాలు, అనేక ప్రాంతీయ పార్టీలతో పాటు వివిధ సమస్యలతో ముడిపడి ఉందని ఖర్గే పేర్కొన్నారు.