Sunday, January 18, 2026
Homeనేషనల్IndiGo Crisis: ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోదీ స్పందన.. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశం

IndiGo Crisis: ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోదీ స్పందన.. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశం

PM Modi Sensational Comments On IndiGo Airlines Crisis: ఎట్టకేలకు ఇండిగో సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ నోరు విప్తారు. చట్టాలు, నిబంధనలు వ్యవస్థలను మెరుగుపర్చడానికే ఉన్నాయి తప్ప ప్రజలను వేధించడానికి కాదన్నారు. ఎన్డీయేపక్ష సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఇవాళ (మంగళవారం) ఉదయం ఎన్డీఏ ఎంపీలతో మోదీ సమావేశమయ్యారు. ప్రభుత్వం వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. నియమ నిబంధనలు మంచివేనని, వ్యవస్థను మెరుగుపర్చేందుకు వాటిని రూపొందించాలన్నారు. చివరకు అవి ప్రజలను వేధించకూడదన్న ఆయన మాటలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గుర్తు చేశారు. ప్రభుత్వం రూపొందించిన చట్టం ప్రజలకు భారం కాకూడదన్నారు. దాదాపు వారం రోజులుగా ఇండిగో విమాన సంస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రతీ రోజూ వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు అవుతున్నాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. పైలట్ల కొరత కారణంగా ఇవాళ వందలాది విమానాలు రద్దయ్యాయి.

- Advertisement -

చట్టాలు ప్రజలకు భారం కాకూడదు..

ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వందలాది మంది ఎయిర్ పోర్టుల్లో పడిగాపులు కాస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ సంక్షోభం ఎప్పటివరకు ముగుస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మంగళవారం హైదరాబాద్ నుండి బయలుదేరే 58 విమానాలు, బెంగళూరు నుండి బయలుదేరే 120కి పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. శీతాకాలం నేపథ్యంలో ఇండిగో సంస్థ కేవలం కొన్ని మార్గాల్లోనే విమానాలను తిప్పే అవకాశాలు ఉన్నాయి. సోమవారం ఒక్క రోజే ఆరు మెట్రో నగరాల విమానాశ్రయాల నుండి 560 కి పైగా విమానాలను ఆ సంస్థ రద్దు చేసింది. ఇండిగో సంస్థలో జరిగిన పరిణామాలపై కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే విచారణ కమిటీని వేసింది. సమస్యకు ఐదు అంశాలు కారణమని ఇండిగో ప్రాథమికంగా నిర్ధారించింది. సాంకేతిక లోపాలు, విమానాల షెడ్యూళ్లలో మార్పు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పెరిగిన రద్దీ వంటివి తాజా సంక్షోభానికి కారణమని తెలిపింది. దీనికితోడు కొత్తగా అమల్లోకి వచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ ఫేజ్- II రోస్టరింగ్ నియమాలను ప్రధానంగా పేర్కొంది. ప్రస్తుతం కొత్త నియమకాలను కేంద్రం తాత్కాలికంగా పక్కనపెట్టింది. కాగా, ఇండిగో సంక్షోభంపై రాజ్యసభలో చర్చ జరిగింది. లోక్‌సభలో మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతుండగా.. సంక్షోభంపై సమగ్ర విచారణకు ఆదేశించామని తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే ఏ సంస్థను ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. ఇండిగో కార్యకలాపాలు వేగంగా స్థిరీకరించబడుతున్నాయని, భద్రత పూర్తిగా అమలులో ఉందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News