PM Modi on Congress import policy : స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సుమారు ఆరున్నర దశాబ్దాల పాటు దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ పార్టీ, దేశాన్ని స్వయం సమృద్ధం చేసిందా లేక పరాధీనంగా మార్చిందా? ఈ ప్రశ్న ఇప్పుడు మరోసారి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ హయాంలో దేశం దిగుమతులపై ఆధారపడటమే కాకుండా, ఆ దిగుమతుల్లో భారీ కుంభకోణాలు జరిగాయని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్‌లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న బలమైన కారణాలేంటి..? కాంగ్రెస్ పాలనపై ఆయన చేసిన ప్రధాన ఆరోపణలు ఏమిటి..?
దిగుమతి కుంభకోణాలతో దేశానికి ద్రోహం : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టిన తరువాత నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. “దేశాన్ని 60 నుంచి 65 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, భారత్‌ను ప్రతి చిన్న విషయానికీ ఇతర దేశాలపై ఆధారపడేలా చేసింది. వారి హయాంలో పాలన మొత్తం దిగుమతి కుంభకోణాల చుట్టూనే తిరిగింది. అందుకే మన దేశం స్వావలంబన కోల్పోయింది,” అని ప్రధాని తీవ్రంగా విమర్శించారు. అమెరికా వంటి దేశాలు భారత ఉత్పత్తులపై సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో, దేశీయ పరిశ్రమలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెబుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రైతులు, చిన్న పరిశ్రమలే మా ప్రాధాన్యం : ప్రభుత్వానికి రైతులు, పశువుల పెంపకందారులు, చిన్నతరహా పరిశ్రమల ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. “దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించే క్రమంలో మాపై అంతర్జాతీయంగా ఎంత ఒత్తిడి పెరిగినా భరించడానికి సిద్ధంగా ఉన్నాం,” అని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ 11 ఏళ్ల పాలనలో దేశంలోని 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామని, ఇది తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని మోదీ అన్నారు. నగరాల్లోని పేదలకు కూడా గౌరవప్రదమైన జీవన పరిస్థితులు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు.


