PM Modi’s criticism of Congress : ఉగ్రవాదులు మన ప్రజల రక్తాన్ని కళ్లజూస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం దిల్లీలో చేష్టలుడిగి చూస్తూ కూర్చుండిపోయింది! కానీ, మా ప్రభుత్వం ఉగ్రవాదులను, వారి వెనుక ఉన్న శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదు! అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గుజరాత్‌లో జరిగిన సభలో ఆయన చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు ప్రధాని ఇంత తీవ్రంగా స్పందించడానికి కారణమేంటి..? ఆయన ప్రసంగంలోని ఆంతర్యమేమిటి..?
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ.. కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శల వర్షం కురిపించారు. ఉగ్రవాదం నుంచి దిగుమతుల కుంభకోణాల వరకు అనేక అంశాలపై ఆ పార్టీని ఎండగట్టారు.
ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. ‘ఆపరేషన్ సిందూర్’ ప్రస్తావన : కాంగ్రెస్ హయాంలోని ఉగ్రవాద దాడులను, తమ ప్రభుత్వ ప్రతిస్పందనను మోదీ పోల్చిచెప్పారు. “పహల్గాం ఉగ్రదాడి తర్వాత మా ఎన్డీయే ప్రభుత్వం తక్షణమే స్పందించి, కేవలం 22 నిమిషాల్లో ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా ఉగ్రస్థావరాలను నాశనం చేసింది. ఇది మన సాయుధ దళాల పరాక్రమానికి, మన దేశ సంకల్పానికి ప్రతీక. కానీ, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు జరిగినప్పుడు ఏమీ చేయలేకపోయింది” అని మోదీ విమర్శించారు. తాము ఉగ్రవాదులను వారి పుట్టలోకే వెళ్లి మట్టుబెడతామని ప్రపంచం మొత్తం చూసిందని ఆయన అన్నారు.
దిగుమతి కుంభకోణాలతో దేశానికి నష్టం : దేశాన్ని 60-65 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, భారత్‌ను బలహీనపరిచి, ఇతర దేశాలపై ఆధారపడేలా చేసిందని మోదీ ఆరోపించారు. “కాంగ్రెస్ పాలనలో దిగుమతి కుంభకోణాలు రాజ్యమేలాయి. అందుకే మన దేశం ప్రతి చిన్న విషయానికీ విదేశాలపై ఆధారపడాల్సి వచ్చింది. కానీ మా ప్రభుత్వానికి రైతులు, పశువుల పెంపకందారులు, చిన్న పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మేం వాటిని భరిస్తాం” అని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల యుద్ధం చేస్తున్న నేపథ్యంలో, స్వావలంబన ఆవశ్యకతను మోదీ నొక్కిచెప్పారు.
గుజరాత్‌లో ఇద్దరు ‘మోహన్’లు : ప్రధాని తన ప్రసంగంలో గుజరాత్ వారసత్వాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. “గుజరాత్‌కు ఇద్దరు మోహన్‌లు స్ఫూర్తి. ఒకరు సుదర్శన చక్రధారి అయిన శ్రీకృష్ణుడు (మోహన్), మరొకరు చరఖా ధరించిన మహాత్మా గాంధీ (మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ)” అని అభివర్ణించారు. శ్రీకృష్ణుడు దేశాన్ని ఎలా రక్షించుకోవాలో నేర్పిస్తే, గాంధీజీ స్వావలంబన మార్గాన్ని చూపారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా గాంధీ పేరును వాడుకుంది కానీ, ఆయన ఆశయాలైన స్వదేశీ, స్వచ్ఛతలను పూర్తిగా విస్మరించిందని దుయ్యబట్టారు.
25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి : తమ 11 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతిని మోదీ వివరించారు. “మా ఎన్డీయే ప్రభుత్వ పాలనలో దేశంలోని 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చాం. నగరాల్లోని పేదలకు గౌరవప్రదమైన జీవనం అందించేందుకు కట్టుబడి ఉన్నాం” అని ఆయన తెలిపారు.


