PM Modi: భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందని ప్రధాని మోదీ (PM Modi) తెలిపారు. రాజ్యంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో(Lok Sabha) నిర్వహించిన ప్రత్యేక చర్చలో మోదీ మాట్లాడారు. ఎందరో మహానుభావులు కలిసి మన రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు. ప్రపంచంలోనే గొప్ప ప్రజా స్వామ్యాన్ని 75 ఏళ్లుగా నిలబెట్టుకున్నామని తెలిపారు.
ప్రజాస్వామ్య పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నామని ఇవి దేశం గర్వపడే క్షణాలన్నారు. మన ప్రజాస్వామ్యం మదర్ ఆప్ డెమోక్రసీగా పేరు గడించిందన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలతో పాటు దేశ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలిపారు. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమే కాదు.. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు అని పేర్కొన్నారు.
దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిదన్నారు. రాజ్యాంగ సభలో 18 మహిళలు ఉన్నారు. రాజ్యాంగ చర్చలో వారు చాలా చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. ఆ స్ఫూర్తితోనే దేశ అధ్యక్షురాలిగా ఆదివాసీ మహిళ ఎన్నికయ్యారని గుర్తు చేశార. అలాగే జీ20 సదస్సులో మనం మహిళా ఆదారిత అభివృద్ధి అంశాన్ని చర్చలో పెట్టామన్నారు. ఇక పార్లమెంట్‌లో మహిళా బిల్లును సభ ముందుకు తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు. ఈ దేశాన్ని వికసిత్ భారత్‌గా మార్చాలని.. ప్రజల మధ్య ఐకమత్యమే దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు విషబీజాలు నాటారని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ మోదీ విమర్శించారు.