పాకిస్థాన్ దేశానికి ప్రధాని మోదీ(PM Modi) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాజస్థాన్‌లోని ఓ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ..ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి భారత భద్రత బలగాలు ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో కేవలం 22 నిమిషాల్లోనే బదులిచ్చి పాకిస్థాన్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టాయని తెలిపారు. ఉగ్రవాదుల ఏరివేతకు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో దేశ ప్రజలంతా గర్విస్తున్నారని పేర్కొన్నారు. సిందూరం భగ్గుమంటే దాని ఫలితం ఎలా ఉంటుందో అందరూ చూశారన్నారు.
ఉగ్రమూకలను మట్టిలో కలిపేశామని.. పాక్‌లోని రహిమ్ యార్ ఖాన్ ఎయిర్‌బేస్ ఐసీయూలో ఉందన్నారు. అణుబెదిరింపులకు భారత్ ఇక ఏమాత్రం భయపడదని చెప్పారు. ఇకపై పాక్‌తో ఎలాంటి వాణిజ్యం, చర్చలు ఉండవని మరోసారి స్పష్టం చేశారు. చర్చలు జరిగితే పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించే జరుగుతాయన్నారు. మన దేశానికి న్యాయంగా చెందాల్సిన సింధూ జలాల నీరు పాక్‌కు ప్రవహించదన్నారు. భారత ప్రజల జోలికివస్తే.. గట్టి గుణపాఠం తప్పదని మోదీ హెచ్చరించారు.