న్యూఢిల్లీ, (తెలుగుప్రభ): కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లక్ష్యంగా విపక్షాలు చేపట్టిన విద్యార్థి ముఖాముఖి కార్యక్రమంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నిర్వహిస్తున్న ‘ఛాత్రోం కీ గూంజ్’ (విద్యార్థుల ప్రతిధ్వని) ప్రచారాన్ని ‘జూఠ్ కీ గూంజ్’ (అబద్ధాల ప్రతిధ్వని) అని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రతిష్టాత్మక ‘శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్’ (ఎస్ఆర్సీసీ) శతాబ్ది ముగింపు వేడుకలకు హాజరైన ప్రధాని, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
2013 చీకటి రోజులను గుర్తుచేసిన ప్రధాని
2013 నాటి యూపీఏ పాలనను, నేటి ఎన్డీయే పాలనను పోల్చి చూపుతూ ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. “2013లో దేశంలో ఏం జరిగిందో నేటి తరం విద్యార్థులకు సరిగ్గా తెలియకపోవచ్చు. అప్పట్లో వార్తల్లో ప్రతిరోజూ సరిహద్దుల్లో సైనికుల హత్యలు, 10 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం, హెలికాప్టర్ కుంభకోణాలు, హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లే హెడ్లైన్లుగా ఉండేవి. నాడు వృద్ధి రేటు పాతాళానికి పడిపోతే, అవినీతి, ధరల పెరుగుదల ఆకాశాన్నంటాయి. ప్రపంచ దేశాలు భారత్‌ను బలహీనమైన ‘ఫ్రాజైల్ ఫైవ్’ (సుళువుగావిరిగే) దేశాల్లో ఒకటిగా పరిగణించాయి” అని మోడీ గుర్తుచేశారు. అప్పట్లో గుజరాత్ సీఎంగా, ప్రతిపక్ష నేతగా ఎస్ఆర్సీసీ వేదికపై ప్రసంగించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. “నాడు నేను విపక్షంలో ఉన్నప్పటికీ ఈ విద్యాసంస్థల వేదికను నాటి కేంద్ర ప్రభుత్వంపై రాజకీయాస్త్రంగా వాడుకోలేదు. నాటి నా ప్రసంగంలో దేశ ప్రగతికి సానుకూల విజన్ మాత్రమే అందించాను” అని స్పష్టం చేశారు.
7.8 శాతం వృద్ధి రేటుతో భరోసా
ప్రస్తుత భారత్ ఆర్థిక స్థిరత్వాన్ని వివరిస్తూ, ఇటీవల నమోదైన 7.8 శాతం త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటు దేశంలో కొత్త నమ్మకాన్ని నింపిందని మోదీ కొనియాడారు. “పశ్చిమాసియాలో యుద్ధం నడుస్తున్నా, వ్యాపార సవాళ్లు ఎదురవుతున్నా భారత్ 7.8 శాతం వేగంతో దూసుకుపోతోంది. జపనీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కూడా భారత్ రేటింగ్‌ను పెంచింది. భారత్‌ను ఫ్రాజైల్ ఫైవ్‌లోకి నెట్టినవారికి ఈ గణాంకాలు జీర్ణం కావడం లేదు. 2013లో గ్లాసు సగం ఖాళీగా ఉందనుకున్న వారి ఆలోచనా తీరు నేటికీ అలాగే ఉంది” అని ఆక్షేపించారు.
ఉగ్రవాదం, నక్సలిజం నడ్డి విరిచాం
పాకిస్తాన్ ఏ చిన్న దుస్సాహసానికి ఒడిగట్టినా మన సాయుధ దళాలు వారి సరిహద్దుల్లోకి దూసుకెళ్లి మరీ దాడులు చేస్తున్నాయని, ఉగ్రవాదాన్ని ప్రసరించే మూలాలను దెబ్బతీశామని మోడీ ధ్వజమెత్తారు. జమ్మూ కాశ్మీర్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు శాంతి భద్రతలు మెరుగయ్యాయని, మావోయిజం, నక్సలిజం నడ్డి విరిచామని స్పష్టం చేశారు.
మెట్రోలో ప్రయాణం.. రూ. 100 నాణేం విడుదల
ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి హాజరయ్యారు. ప్రయాణంలో విద్యార్థులు, సాధారణ పౌరులతో మాట్లాడారు. ఎస్ఆర్సీసీ 100 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ప్రత్యేక రూ. 100 స్మారక నాణేన్ని ఆయన విడుదల చేశారు. దివంగత అరుణ్ జైట్లీ, సంజీవ్ సన్యాల్ వంటి ఎందరో దిగ్గజాలను అందించిన ఎస్ఆర్సీసీ సమాజానికి స్ఫూర్తిదాయక సముద్రం వంటిదని కొనియాడారు.

