PM Modi to Inaugurate Chhattisgarh Assembly Building: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. నవంబర్ 1న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నయా రాయ్‌పూర్‌లో కొత్తగా నిర్మించిన ఛత్తీస్‌గఢ్ శాసనసభ (అసెంబ్లీ) భవనాన్ని ప్రారంభించనున్నారు. అట్టహాసంగా జరగనున్న ఈ కార్యక్రమంలో గవర్నర్, ముఖ్యమంత్రి, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు.
రాజ్‌కుమార్ కాలేజీ నుండి అత్యాధునిక భవనం వరకు
భారతదేశంలో 26వ రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్ 2000 నవంబర్ 1న ఆవిర్భవించింది. అప్పుడు శాశ్వత భవనం సిద్ధంగా లేకపోవడంతో, మొదటి శాసనసభ సమావేశం 2000 డిసెంబర్ 14న రాయ్‌పూర్‌లోని రాజ్‌కుమార్ కాలేజీలో ఒక తాత్కాలిక టెంట్‌లో జరిగింది.
ఇప్పుడు, నయా రాయ్‌పూర్‌లోని సెక్టార్ 19లో 52 ఎకరాల విస్తీర్ణంలో రూ. 324 కోట్ల వ్యయంతో అత్యాధునిక అసెంబ్లీ భవనం రూపుదిద్దుకుంది. సాంప్రదాయ ఛత్తీస్‌గఢీ కళ, ఆధునిక నిర్మాణ శైలి మేళవింపుతో నిర్మించిన ఈ భవనం, భారతదేశంలోనే అత్యంత సాంకేతికత కలిగిన శాసనసభ భవనాలలో ఒకటిగా పరిగణించబడుతోంది.
పర్యావరణ అనుకూల హంగులు
ఈ కొత్త సముదాయం అసెంబ్లీ హౌస్, అసెంబ్లీ సెక్రటేరియట్, సెంట్రల్ హాల్ అనే మూడు ప్రధాన విభాగాలుగా విభజించబడింది. ఇందులో సోలార్ ప్యానెల్‌లు, వర్షపు నీటి సంరక్షణ (Rainwater Harvesting) వంటి పర్యావరణ అనుకూల వ్యవస్థలను ఏర్పాటు చేశారు. దాదాపు 700 వాహనాల కోసం పార్కింగ్ సౌకర్యాలు కూడా కల్పించారు.
భవనం లోపలి భాగంలో ఛత్తీస్‌గఢ్ గిరిజన, ప్రాంతీయ వారసత్వాన్ని ప్రతిబింబించేలా బస్తర్, సుర్గుజా కళాకృతులను పొందుపరిచారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత 90 మంది ఎమ్మెల్యేలకు బదులుగా, 120 మంది సభ్యులకు వసతి కల్పించేలా అసెంబ్లీని డిజైన్ చేశారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ప్రవేశ ద్వారం వద్ద ప్రతిష్టించడం ఈ నూతన సముదాయానికి ప్రత్యేక ఆకర్షణ. అలాగే, రాష్ట్ర రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిణామాలను ప్రదర్శించడానికి భవనంలో ఒక మ్యూజియాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు.
ALSO READ: Raghupathi on BJP: 2026 ఎన్నితల తర్వాత బీజేపీ కనిపించదు.. DMK మంత్రి సంచలన కామెంట్స్..


