Rajya Sabha debate on Operation Sindoor: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌పై జులై 29న పార్లమెంట్‌లో చర్చ జరగనుంది. ప్రతిపక్షాల డిమాండ్ల నేపథ్యంలో రాజ్యసభలో ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా హాజరై ప్రసంగించనున్నారు. జాతీయ భద్రత వైఫల్యం, డొనాల్డ్ ట్రంప్ జోక్యం వంటి విషయాలను విపక్షాలు ఆయుధంగా చేసుకోవాలని భావిస్తుండగా, ఆపరేషన్ సింధూర్ విజయాన్ని మరోసారి చాటిచెప్పాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో జరగనున్న చర్చపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉగ్రమూకల దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. ఎలాగైన ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పాలని, ఉగ్రమూకలను మట్టుబెట్టాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే మే 7న పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యాలు మెరుపుదాడి చేశాయి.
16 గంటల పాటు చర్చ..
మంగళవారం జరగబోయే చర్చ దాదాపు 16 గంటల పాటు కొనసాగనుంది. ఇందులో ‘ఆపరేషన్ సింధూర్’ సహా తదనంతరం భారత్, పాక్ మధ్య జరిగిన డ్రోన్ దాడులు, ఆపై కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం వంటి అంశాలపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా, కాల్పుల విరమణకు తానే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పుకోవడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే, భారత్ మాత్రం అది రెండు దేశాల మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ఫలితమేనని స్పష్టం చేసింది.


