PM Modi to visit China for SCO Summit: భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో పర్యటించనున్నారు. గాల్వాన్ ఘర్షణ తర్వాత ఆయన చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు టియాంజిన్ నగరంలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సుకు హాజరయ్యేందుకు ఆయన చైనా వెళ్తున్నారు.
2020లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత భారత్, చైనా మధ్య సంబంధాలు క్షీణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
2024 అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఆ సమావేశం తర్వాత ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. కైలాష్-మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభం కావడంతో సంబంధాలు మెరుగుపడ్డాయి.
ఈసారి SCO సదస్సులో మొత్తం పది సభ్య దేశాలు పాల్గొంటాయి. ఈ సదస్సులో ఉగ్రవాదం, ప్రాంతీయ భద్రత, వాణిజ్యం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. పాకిస్తాన్‌కు చైనా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. జూన్‌లో జరిగిన SCO రక్షణ మంత్రుల సమావేశంలో పహెల్గామ్ ఉగ్రదాడిని ప్రస్తావించనందుకు సంయుక్త ప్రకటనపై సంతకం చేయడానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిరాకరించారు.
ఈ సదస్సులో ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశాలు జరిపే అవకాశం ఉంది. ఈ పర్యటనతో భారత్-చైనా సంబంధాల్లో స్థిరత్వం, చర్చలు తిరిగి ప్రారంభమవుతాయని నిపుణులు ఆశిస్తున్నారు.


