PM Modi’s Foreign Trips Cost: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2021 నుంచి ఇప్పటివరకు జరిపిన విదేశీ పర్యటనలకు రూ. 362 కోట్లు ఖర్చయినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో ఈ వివరాలను సమర్పించింది. 2025లో ఆయన అమెరికా, ఫ్రాన్స్ సహా ఐదు దేశాల్లో పర్యటించారు. అందుకు గానూ రూ. 67 కోట్లకు పైగా వ్యయమైనట్లు తెలిపింది.
అత్యంత ఖరీదైన ట్రిప్.. ఫ్రాన్స్
ప్రధాని మోడీ పర్యటనల్లో ఫ్రాన్స్ ట్రిప్ అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. ఈ ఒక్క పర్యటనకే రూ. 25 కోట్లకు పైగా ఖర్చు అయింది. పారిస్‌లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ప్రధాని మోడీ, అనంతరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఇది ఫ్రాన్స్‌కు ఆయన చేసిన ఆరో పర్యటన కావడం గమనార్హం. గతంలో 2023 జూన్‌లో ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు రూ. 22 కోట్లు ఖర్చయింది.
దేశాల వారీగా..
విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ గురువారం రాజ్యసభలో ఇచ్చిన సమాచారం ప్రకారం, 2025లో ప్రధాని మోడీ సందర్శించిన ఐదు దేశాల వారీగా ఖర్చుల వివరాలు ఇలా ఉన్నాయి:
ఫ్రాన్స్ – రూ. 25,59,82,902
అమెరికా – రూ. 16,54,84,302
థాయిలాండ్ – రూ. 4,92,81,208
శ్రీలంక – రూ. 4,46,21,690
సౌదీ అరేబియా – రూ. 15,54,03,792.47.
అయితే, ఈ ఏడాది ప్రధాని మోడీ మారిషస్, సైప్రస్, కెనడా, క్రొయేషియా, ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలకు చేసిన పర్యటనలకు సంబంధించిన ఖర్చుల వివరాలు ఇంకా అందుబాటులో లేవు. “బిల్లులు ఇంకా సెటిల్‌మెంట్ దశలో ఉన్నాయి. మొత్తం ఖర్చు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది” అని ప్రభుత్వం పేర్కొంది.


