Women Reservation Bill PM Modi: మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన వారు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గురువారం లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన బిల్లులపై జరిగిన చర్చలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లుకు రాజకీయ రంగు పులమవద్దని ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించినది కాదని, దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఉమ్మడి విజయమని స్పష్టం చేశారు.
‘దేశంలో మహిళా రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి జరిగిన ఎన్నికల్లో, ఈ హక్కును వ్యతిరేకించిన వారిని మహిళలు ఎన్నడూ క్షమించలేదు. వారు రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకున్నారు. ‘నారీ శక్తి వందన్’ బిల్లు- క్రెడిట్ కేవలం మాకు లేదా మా ప్రభుత్వానికో మాత్రమే కాకుండా, పార్లమెంటులోని సభ్యులందరికీ దక్కుతుంది. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు.’ – ప్రధాని మోదీ
దేశ చరిత్రలో ఇది ఒక కీలక ఘట్టమని ప్రధాని మోదీ వెల్లడించారు. చరిత్ర సృష్టించడానికి పార్లమెంట్‌కు ఇది ఒక సువర్ణ అవకాశమని పేర్కొన్నారు. దేశంలోని సగం జనాభాకు అధికారం ఇవ్వడం ఒక అద్భుత అవకాశమని.. సమయాన్ని బట్టి మనం కూడా మారుతూ ఉండాలని హితవు పలికారు.
‘దేశానికి సరికొత్త దిశను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మహిళలకు అధికారం అంటేనే.. వికసిత్ భారత్ అని అర్థం. మహిళలకు అధికారం ఇస్తే దేశానికి సరికొత్త మార్గం చూపిస్తారు. 30 ఏళ్ల పాటు ప్రయత్నాలు జరిగినా గతంలో ఇది సాకారం కాలేదు. ఈ బిల్లును వ్యతిరేకించే వారిని మహిళా లోకం క్షమించదు. బిల్లుకు మద్దతిచ్చే పార్టీలకే రాజకీయ మనుగడ ఉంటుంది. ఈ బిల్లును తేవడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లును దేశమంతా స్వాగతిస్తోంది. ఈ బిల్లుకు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతివ్వాలి.’ – ప్రధాని మోదీ

