178 TP’S and TC’S blacklisted in PMKVY Scheme: దేశంలో నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు, ఉద్యోగాల కల్పనలో భాగంగా యువతలో స్కిల్స్‌ను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ఓ పథకాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ పథకం దుర్వినియోగం అవుతున్నట్లు చాలా కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. ఇంతకీ ఆ పథకం ఏంటి.. వచ్చిన ఆరోపణలేంటి.? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడమే లక్ష్యంగా రూపొందించిన ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) అమలులో భారీ అవకతవకలు చోటుచేసుకున్నట్లు వెలుగులోకి వచ్యాయి. శిక్షణార్థులు లేకపోవడం, నకిలీ పత్రాలు, శిక్షణ కేంద్రాలు లేకపోవడం వంటి అనేక అవకతవకలు జరిగినట్లు సమాచారం. 2015లో ప్రారంభమైన పీఎంకేవీవై ద్వారా జూన్ 2025 వరకు.. కోటి 64 లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చారు. అయితే 2022లో ఈ పథకంలో నాల్గవ ఎడిషన్ (PMKVY 4.0) ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ పథకం అమలులో వివిధ అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది.
నకిలీ బిల్లులు పెట్టడం, విద్యార్థులు శిక్షణకు హాజరు కాకపోవడం, నకిలీ పత్రాలు సృష్టించి ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకులు డబ్బులు దోచేసిట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. కొన్ని చోట్ల అసలు ట్రైనింగ్ సెంటర్లు లేకుండానే డబ్బులు దండుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన నియమాలను పాటించని వ్యక్తులు, సంస్థలపై చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ, నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ అక్టోబర్ 30న అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ప్రాంతీయ డైరెక్టరేట్లకు లేఖ రాసింది.
Also Read: https://teluguprabha.net/national-news/supreme-court-ahmedabad-air-crash-pilot-sumit-sabharwal/
ఈ క్రమంలో పీఎంకేవీవై దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించిన 178 శిక్షణ భాగస్వాములు(TPలు), శిక్షణ కేంద్రాలపై(TCలు) నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ, జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (NSDC) కఠిన చర్యలు తీసుకుంది. వాటిని బ్లాక్ లిస్ట్ చేసింది. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 59 TPలు, TCలు బ్లాక్ లిస్ల్‌లో చేరాయి. ఢిల్లీ (25), మధ్యప్రదేశ్ (24), రాజస్థాన్ నుంచి (20) శిక్షణ భాగస్వాములు, శిక్షణా కేంద్రాలను బ్లాక్ లిస్ట్‌లో చేర్చారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా, వారిలో టెక్నికల్ స్కిల్స్‌ను పెంపొందించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) పథకం ప్రక్షాళన అవుతుందా.. అర్హులకు ఈ పథకం ఫలాలు అందుతాయా.. వీటిపై కేంద్ర ప్రభుత్వం మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకోనుంది వేచి చూడాలి.


