VHP Urges Garba Organisers To Bar Non-Hindus: మహారాష్ట్రలో త్వరలో ప్రారంభం కానున్న నవరాత్రి ఉత్సవాలకు ముందు గర్బా కార్యక్రమాల నిర్వహణపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. విశ్వ హిందూ పరిషత్ (VHP), గర్బా కార్యక్రమాల్లోకి హిందూయేతరులు రాకుండా అడ్డుకోవాలని, అవసరమైతే ఆధార్ కార్డు తనిఖీ చేయాలని నిర్వాహకులను కోరడం ఈ వివాదానికి మూల కారణం.
ALSO READ: Zubeen Garg: గాన గంధర్వుడు జుబీన్ గార్గ్ ఇకలేరు.. స్తంభించిన అస్సాం.. వీధుల్లో వేలాది జనం నివాళి
గర్బా కేవలం నృత్యం కాదని, అది దుర్గాదేవిని పూజించే ఒక ఆరాధన రూపమని వీహెచ్‌పీ జాతీయ ప్రతినిధి శ్రీరాజ్ నాయర్ పేర్కొన్నారు. “విగ్రహారాధనను విశ్వసించని వారికి ఈ వేడుకల్లో పాల్గొనే హక్కు లేదు. ఈ ఆచారాలపై విశ్వాసం ఉన్నవారిని మాత్రమే అనుమతించాలి” అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాక, పాల్గొనేవారికి తిలకం దిద్ది, ప్రవేశానికి ముందు పూజ చేసేలా చూడాలని నిర్వాహకులకు సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమాలను తాము, బజరంగ్ దళ్ కార్యకర్తలు పర్యవేక్షిస్తామని నాయర్ తెలిపారు.
అగ్గి రాజేయాలని చూస్తున్నారంటూ కాంగ్రెస్ విమర్శ
వీహెచ్‌పీ ప్రకటనపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు భిన్నంగా స్పందించాయి. బీజేపీ నాయకుడు, రాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బావన్‌కులే మాట్లాడుతూ, “వారు [వీహెచ్‌పీ] అలా కోరడం వారి హక్కు. అయితే, పోలీసుల అనుమతి ఉందా లేదా అన్నదే ఇక్కడ ముఖ్యమైన అంశం” అని అన్నారు.
అయితే, కాంగ్రెస్ నాయకుడు విజయ్ వడెట్టివార్ తీవ్రంగా స్పందించారు. వీహెచ్‌పీ “సమాజంలో అగ్గి రాజేయాలని” చూస్తోందని ఆరోపించారు. “వారు మతం పేరుతో సమాజాన్ని విభజించి, దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు” అని విమర్శించారు.
కేంద్రమంత్రి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే భాగస్వామ్య పక్షం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (A) అధ్యక్షుడు రామదాస్ అథవాలే కూడా వీహెచ్‌పీ వైఖరిని తప్పుబట్టారు. “గర్బాకు ఎవరు వెళ్లాలి, ఎవరు వెళ్లకూడదో నిర్ణయించడానికి వీహెచ్‌పీ ఎవరు? ఇటువంటి పిలుపులు మత ఘర్షణలకు, హింసకు బహిరంగ ఆహ్వానం” అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రకటనలు దేశ సామాజిక సామరస్యానికి తీవ్రమైన ముప్పు అని, నవరాత్రి సమయంలో ఏదైనా గొడవ జరిగితే పూర్తి బాధ్యత వీహెచ్‌పీదేనని అథవాలే హెచ్చరించారు.
ALSO READ: Indian Navy: భారత నౌకాదళం చరిత్రలో భారీ డీల్.. త్వరలో రూ.80,000 కోట్ల టెండర్!


