Madhya Pradesh Trending: మధ్యాహ్న భోజనం పథకం దేశ భవిష్యత్తును తీర్చిదిద్దటంతో పాటు వారి పిల్లల ఆకలి తీర్చే లక్ష్యంగా ఏర్పాటయ్యింది. పేదరికంతో పోరాడుతున్న చిన్నారులు కనీసం ఒక పూట కడుపునిండా తినాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. కానీ మధ్య ప్రదేశ్‌లోని షియోర్‌పూర్ జిల్లాలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన, ఆ మహత్తర ప్రయత్నం ఎక్కడో విఫలమవుతోందన్న బాధను కలిగిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. హల్‌పూర్ గ్రామంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో రెండు రోజుల క్రితం.. చిన్నారులకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న తీరు చూడగానే మనసు కలిచివేస్తోంది. పిల్లలకు భోజనం ఇవ్వడానికి ప్లేట్లు లేకపోవడంతో.. మురికి నేలపై చిత్తు కాగితాలు వేసి వాటిపై అన్నం వడ్డించారు. పేదరికమే కాదు గౌరవం కోల్పోయేంత పరిస్థితులు రావడం సమాజం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇది సూచిస్తోంది. విద్యాలయం పిల్లలు పాఠాలతో పాటు సమానత్వాన్ని నేర్చుకునే స్థలం కావాలి. కానీ ఈ దృశ్యం, ఆ ఆలోచనకు విరుద్ధంగా నిలిచింది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతోఅధికార యంత్రాంగం చర్యలు స్టార్ట్ చేసింది. జిల్లా కలెక్టర్ అర్పిత్ వర్మ వెంటనే దర్యాప్తు ఆదేశించారు. విచారణలో సంఘటన నిజమని తేలింది. దానికి బాధ్యులైన ఇద్దరు వ్యక్తులను విధుల నుండి తొలగించి చర్యలు ప్రారంభించారు.
ఆ చిత్తు కాగితాల్లో భోజనం చేసిన చిన్నారి ముఖంలో తృప్తి లేదు.. అలా అని నిరాకరణ లేదు. కానీ ఒక ప్రశ్న మాత్రం ఉంది: “మేము కూడా ఈ దేశపు పిల్లలమే కదా?” అని. సమాజం, అధికారులు, వ్యవస్థలు దీనికి బాధ్యత వహించాలని సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. పిల్లలను దేవుళ్లుగా భావించే దేశంలో కనీస గౌరవం కోల్పోకూడదనే దానిపై మనమంతా కలసి ఆలోచించాల్సిన సమయం ఇది.


